Salar 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా వరుస సినిమాల షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. చివరిగా ‘కల్కి 2898 AD’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న డార్లింగ్, ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. అంతేకాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘సలార్ 2: శౌర్యాంగ పర్వ’ . మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంపై ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, ప్రభాస్ ఈ సీక్వెల్‌కి కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడట. మరోవైపు ‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో మరో భారీ ప్రాజెక్ట్ కూడా చేయనున్నట్టు సమాచారం. హోంబలే ఫిలిమ్స్ మాత్రం ‘సలార్ 2’ను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ షెడ్యూల్, మరియు ప్రభాస్ ఇతర ప్రాజెక్టుల తాలూకు కమిట్మెంట్స్ దృష్ట్యా ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజీ’, అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా కూడా లైన్లో ఉంది. మరోవైపు నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్‌తో కలిసి ‘రావణం’ అనే పాన్-ఇండియా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయనున్నట్టు ఇండస్ట్రీలో టాక్.ఈ బిజీ షెడ్యూల్ మధ్య సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే షూటింగ్‌కి సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడం వల్ల అందరిలో అసహనం కలుగుతుంది.మరి మేకర్స్ ఎప్పుడు కనికరిస్తారో చూడాల్సి ఉంది.