Salaar Movie | విడుదలకింకా నెల రోజుల టైమ్ కూడా లేదు. ఇప్పటివరకు ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు, పాటలు లేవు, ట్రైలర్ లేదు, అసలు ఏం జరుగుతుందని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఓ వైపు బిజినెస్ లీకులతో లేని పోని హైప్ పెరిగిపోతుంది. మరోవైపు సలార్ మేకర్స్ అప్డేట్ విషయంలో నత్తనడక సాగిస్తుంది. అప్డేట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ పడే బాధ అంతా ఇంతా కాదు. కొందరు అభిమానులైతే అసలు అనుకున్న డేట్‌కు సలార్ సినిమాను రిలీజ్ చేస్తారా అంటూ హోంబలే బ్యానర్‌ను ట్యాగ్ కూడా చేసేస్తున్నారు. అప్పుడెప్పుడో రిలీజైన టీజర్ రికార్డుల సృష్టించిన విషయం పక్కన పెడితే.. ప్రభాస్ అభిమానులను ఫుల్ సాటిస్ఫై చేసింది లేదు. ప్రభాస్ మొహం కూడా చూపించలేరని నిరాశ పడ్డ ఫ్యాన్స్ ఎందరో.
దాంతో ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా సలార్ ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 6న రిలీజ్ కాబోతున్నట్లు గట్టిగా వినిపిస్తుంది. అంతేకాకుండా మరునాడు రిలీజ్ కాబోతున్న జవాన్ థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శితం కానుందని తెలుస్తుంది. ఒక్క టీజర్‌తోనే కొత్త రికార్డులను సృష్టించిన సలార్.. ట్రైలర్‌తో ఇంకా ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ లెక్కలు వింటుంటే గూస్బంప్స్ అనే మాట కూడా చిన్నదిగానే అనిపిస్తుంది. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు రూ.80 కోట్ల డీల్ ఫిక్సయినట్లు టాక్. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండొందల కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందట.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ చేసేలా గట్టి ప్రయత్నాలే చేస్తుందట హోంబలే సంస్థ. అంతేకాకుండా విెదేశాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.