Sakshi Agarwal | దక్షిణాది సినీ నటి సాక్షి అగర్వాల్ తన జీవితంలో మరో కీలక అడుగు వేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తన చిరకాల కలను నిజం చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘ఓకూ (OKU)’ పేరుతో ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించారు. కొత్త సంస్థ ప్రారంభం సందర్భంగా సాక్షి అగర్వాల్ భావోద్వేగంగా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను గత ఐదేళ్లుగా నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తూ, ఉత్పత్తుల నాణ్యత, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ప్రజల అంచనాలకు తగ్గట్టుగా అత్యుత్తమ నాణ్యత కలిగిన పోషకాహార ఉత్పత్తులను రూపొందించడమే నా లక్ష్యం. ప్రతి ఉత్పత్తి విషయంలో నాణ్యతకు ఎలాంటి రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో పనిచేశాను అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక న్యూట్రిషన్ ఉత్పత్తులకు సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని, అయితే తాను ప్రారంభించిన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఎంతో గర్వంగా ఉందని సాక్షి తెలిపారు. సినిమా షూటింగ్‌లతో పాటు ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ ఈ సంస్థను నిర్మించానని, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.
ఎన్నో సంవత్సరాలుగా నేను కలగన్న స్వప్నం నేడు సాకారమైంది. ప్రజలకు నమ్మకమైన, నాణ్యమైన పోషకాహార ఉత్పత్తులను అందించే సంస్థగా ‘ఓకూ’ను తీర్చిదిద్దాలనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని సాక్షి అగర్వాల్ వెల్లడించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సాక్షి అగర్వాల్.. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’, ‘సిండ్రెల్లా’, ‘టెడ్డి’, ‘అరణ్మనై 3’, ‘ది నైట్’ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే ‘బిగ్‌బాస్ తమిళ్’ రియాలిటీ షోలో పాల్గొని మరింత ప్రజాదరణ పొందారు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సాక్షి.. ఇప్పుడు వ్యాపారవేత్తగా కూడా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం విశేషం. సినీ కెరీర్‌తో పాటు వ్యాపార రంగంలోనూ విజయవంతం కావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.