AR Rahman| ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇటీవల ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. విడాకులు, ఆ తర్వాత ఛావా సినిమాకి అందించిన సంగీతం, అనంతరం అనారోగ్యం విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు. అయితే కొద్ది రోజుల క్రితం తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఏఆర్ రెహమాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో ముగింపు పలికామని చెప్పుకొచ్చారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయాక కూడా వీరు విడిపోవడం ఏంటని చాలా మంది ముచ్చటించుకున్నారు. అయితే తన భార్య నుండి రెహమాన్ విడిపోవడానికి కారణం ఆయన సంగీత బృందంలో బాసిస్ట్ గా ఉన్న మోహిని డే అనే అమ్మాయి అంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి.
ఈ నేపథ్యంలో, రెహమాన్ భార్య సైరా భాను స్పందించి… రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని, ఆయననేమీ అనొద్దని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఇక తాజాగా సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురి కావడంతో, ఆయనని చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. అయితే రెహమాన్ ఆసుపత్రికి వెళ్లాడని తెలుసుకున్న ఆయన భార్య సైరా భాను స్టేట్మెంట్ విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ఛాతి నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిసింది. అల్లా దయతో ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషిస్తున్నాను అని పేర్కొంది.
అయితే కొందరు నన్ను రెహమాన్ మాజీ భార్య అంటున్నారు. అలా పిలవొద్దని సైరా బాను కోరారు. రెహమాన్, తాను ఇంకా విడిపోలేదని, భార్యాభర్తలుగానే ఉన్నామని వెల్లడించారు. తాము అధికారికంగా విడాకులు తీసుకోలేదు. ఇప్పటికీ భార్యాభర్తలుగానే కొనసాగుతున్నాము. గత రెండు సంవత్సరాలుగా తాను ఆరోగ్యంగా లేనందున ఆయనకు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదనే ఉద్దేశంతో దూరంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. తన ప్రార్ధనలు ఎప్పుడు రెహమాన్‌తో ఉంటాయి. ఆయన కుటుంబ సభ్యులు రెహమాన్‌ని మంచిగా చూసుకోవాలని సైరా కోరింది. కాగా, రెహమాన్ లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా ఇలా జరిగిందని వైద్యులు చెప్పినట్టు ఆయన ప్రతినిధి తెలిపారు.