Saina Nehwal | క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కే బయోపిక్స్‌కి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, మేరీకోమ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించి ఈ జానర్‌కు మరింత క్రేజ్ తెచ్చాయి. అదే కోవలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథపై రూపొందిన చిత్రం ‘సైనా’ కూడా విడుదలైంది. ఈ సినిమా వచ్చిన నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఒక ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. సైనా నెహ్వాల్ బయోపిక్‌లో ఆమె పాత్రను పోషించిన నటి పరిణీతి చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో సైనాను అన్‌ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ ఈ విషయం పలుమార్లు వైరల్ కాగా, తాజాగా సైనా ఇచ్చిన స్పందనతో ఈ అంశం మరింత స్పష్టతకు వచ్చింది. ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా ఈ విషయాన్ని చాలా సూటిగా, పరిణతితో వివరించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన సైనా, “నిజానికి ఈ అన్‌ఫాలో విషయం నేను ఎప్పుడూ గమనించలేదు. నా ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను. ఇలాంటి సోషల్ మీడియా విషయాలపై నేను ఎక్కువగా దృష్టి పెట్టను” అని తెలిపారు. ఈ మాటలతోనే ఈ అంశానికి తాను ఎంత ప్రాముఖ్యత ఇవ్వలేదో స్పష్టం చేశారు.అంతేకాదు, పరిణీతి చోప్రాతో తన అనుబంధం గురించి కూడా సైనా స్పష్టత ఇచ్చారు. “మేమిద్దరం ఎప్పుడూ మంచి స్నేహితులమని చెప్పుకోలేదు. సినిమా కోసం జరిగిన సెషన్లలో నా జీవిత ప్రయాణం గురించి ఆమెకు వివరించాను. అది పూర్తిగా ప్రొఫెషనల్ అవసరాల కోసమే. షూటింగ్ సమయంలో మేము కలిసి లంచ్‌లు లేదా డిన్నర్లకు వెళ్లలేదు. రెండు మూడు వారాలకు ఒకసారి గంట లేదా రెండు గంటలు మాత్రమే కలిసేవాళ్లం. అప్పుడూ డైరెక్టర్ మా మధ్య ఉండేవారు” అని చెప్పారు.
మేమిద్దరం కలిసి ఎక్కువ సమయం గడపలేదని, అలాంటప్పుడు ఫాలో లేదా అన్‌ఫాలో వంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని సైనా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కనిపించే ఊహాగానాలకు భిన్నంగా, వారి మధ్య వ్యక్తిగత మనస్పర్థలు ఏవీ లేవన్నది ఆమె మాటల్లో స్పష్టంగా వినిపించింది.నిజానికి పరిణీతి చోప్రా సైనాను అన్‌ఫాలో చేయడంపై అప్పట్లో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించారు. అయితే సైనా ఇచ్చిన తాజా సమాధానంతో ఆ చర్చకు ఫుల్స్టాప్ పడినట్లైంది. ప్రస్తుతం సైనా, పరిణీతి ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడం లేదు. అయినప్పటికీ, వారి సంబంధం పూర్తిగా వృత్తిపరమైనదే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని అర్థమవుతోంది. ‘సైనా’ సినిమా విడుదలై నాలుగేళ్లు గడిచినా, ఇప్పటికీ సైనా–పరిణీతి అనుబంధంపై నెటిజన్లకు ఆసక్తి తగ్గలేదు. అయితే ఈ ఇంటర్వ్యూతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది.