Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హిందీతో పాటు తెలుగులోను నటించి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16న ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి ఒకరు చొరబడి.. కత్తితో అటాక్ చేశాడు. సైఫ్ కత్తిపోట్లకు గురవగా.. ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అంతా నిద్రిస్తున్న సమయంలో దుండగుడు.. దొంగతనానికి యత్నించగా నటుడు అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే సైఫ్‌పై అతడు దాడి చేసి పారిపోయాడు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై మొత్తం 6 చోట్ల కత్తి పోట్లు ఉండగా.. రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు తెలిపారు వైద్యులు.
ఈ ఘటనకు సంబంధించి ముంబయి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు.. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీపుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్ట్ చేశారు. అయితే విచారణలో డబ్బు దొంగిలించడం కోసమే నిందితుడు హీరో ఇంటికి వెళ్లాడని తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ దాదాపు 8 నెలల క్రితం భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టాడు. ముంబయి రావడానికి ముందు అతని 15 రోజుల పాటు కోల్‌కతాలో ఉన్నాడు. నగరానికి వచ్చాక ఇక్కడ ఓ హోటల్లో పనిచేసిన అతను, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని ఇందుకోసం భారత పౌరుడిగా నకిలీ ఆధార్, పాన్ కార్డు పొందాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నకిలీ పత్రాలతో పాస్ పోర్టుకు అప్లై చేయాలని భావించాడు. అయితే ఫేక్ సర్టిఫికెట్స్ కావాలి అంటే రూ.30 వేలు కావాలని ఏజెంట్ చెప్పడంతో ఇందుకోసం ఓ చిన్న చోరీ చేయాలని ని భావించాడు. ఈ మేరకు సైఫ్ ఉన్న బిల్డింగ్‌లోకి ఏసీ డక్ట్ సాయంతో ఇంట్లోకి వెళ్లాడు. అతన్ని చూసిన సైఫ్ చిన్న కుమారుడి జేహ్ కేర్ టేకర్ కేకలు వేయగా, అక్కడికి సైఫ్ చేరుకున్నాడు. ఆ సమయంలో చిన్న పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సైఫ్‌పై దుండగుడు దాడికి పాల్పడ్డాడు.’ అని విచారణలో నిందితుడు తమకు చెప్పినట్లు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత దాదాపు 20 బృందాలుగా ఏర్పడిన పోలీసులు 3 రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కీలక విషయాలు వెల్లడించారు.