Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shahzad)ను శనివారం అర్థరాత్రి 2.50గంటలకు థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇతడు విజయ్ దాస్‌గా పేరు మార్చుకొని థానే ప్రాంతంలోనే నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే షెహజాద్‌ను అరెస్ట్ చేసిన అనంతరం బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు పోలీసులు. ఈ కేసును ఆదివారం విచారించిన న్యాయస్థానం నిందితుడికి 5 రోజులపాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. దీంతో అతడికి బాంద్రా పోలీస్ స్టేషన్‌కి తరలించారు పోలీసులు.
అయితే ఈ కేసుపై నిందితుడి తరపున న్యాయవాదులు మాట్లాడుతూ.. నిందితుడికి 5 రోజుల కస్టడీ విధించినట్లు వెల్లడించారు. అలాగే ఈ కేసుపై పోలీసులు విచారణ సరిగ్గా చేయలేదని ఆరోపించారు. మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్‌కి చెందిన వాడు అనడానికి పోలీసుల దగ్గర సరైన ఆధారాలు లేవని.. అతడు ఆరు నెలల క్రితం బంగ్లా నుంచి పారిపోయి ఇండియా వచ్చాడు అంటున్నారు ఈ వార్తల్లో కూడా నిజం లేదని న్యాయవాదులు తెలిపారు.