తొలి సినిమాకే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన చాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ సయీ మంజ్రేకర్. ‘దబంగ్ 3’తో బాలీవుడ్‌కు పరిచయమైన సయీ, ‘మేజర్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుస అవకాశాలు అందుకుంటున్న సయీకి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురైన ఈమె ఇప్పుడు దక్షిణాదిపై దృష్టిపెట్టింది. ఇటీవల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముంబయి ముద్దుగుమ్మ పంచుకున్న కబుర్లు..
మరాఠీ సినిమాలు నా కెరీర్‌కు పునాదిగా పనిచేశాయి. ‘ఆప్లా మానూస్’ లాంటి సినిమాల్లో నటించడం వల్ల నటనలో మెలకువలు నేర్చుకున్నాను. ఆ అనుభవం ఇతర భాషల్లో నటించడానికి ఉపయోగపడింది. తెలుగు, హిందీ, మరాఠీ ఇలా బహుభాషా చిత్రాల్లో నటించడం వల్ల.. డైలాగ్ డెలివరీలో పర్ఫెక్షన్ సాధించగలిగాను. అదే నా బలంగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. నా షూటింగ్ అప్డేట్స్, పర్సనల్ మూమెంట్స్ అందులో షేర్ చేస్తుంటాను. అభిమానుల కామెంట్స్‌కు రిైప్లె ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వారి ఆదరణ వల్లే కెరీర్లో
రాణించగలుగుతున్నా! మరిన్ని విభిన్నమైన పాత్రలతో అందరినీ అలరించాలనే లక్ష్యంతో ఉన్నా!
ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. నచ్చిన ప్రతి ఫ్రేమ్నూ కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తా. ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తాను. యోగా, వర్కవుట్లకు ఎక్కువ సమయం కేటాయిస్తాను. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం నా హాబీ. పనీర్ టిక్కా, బిర్యానీ అంటే ఇష్టం.
అమ్మానాన్న ఇద్దరూ ఇండస్ట్రీలో ఉండటంతో ఎప్పుడూ ఇంట్లో సినిమాల గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. దాంతో చిన్నప్పటి నుంచే నాకు సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడింది. కానీ, ‘దబంగ్ 3’తో నటనపై ఇష్టం మొదలైంది. దీపికా పదుగొణె, సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్, పర్సనాలిటీ బాగా నచ్చుతుంది.
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా నా కెరీర్లో ఒక మైలురాయి. ఈ సినిమా ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నా. మంచి అవకాశాలు అందుకుంటున్నా. ఈ చిత్రం కోసం డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. ఎప్పటికప్పుడు సీన్స్ రిహార్సల్స్ చేసేదాన్ని.
చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. శాస్త్రీయ నృత్యం సాధన చేశాను. వెస్ట్రన్లోనూ శిక్షణ తీసుకున్నా. డ్యాన్స్ రావడం నా కెరీర్‌కు ప్లస్ అయింది. ‘దబంగ్ 3’లో ‘మున్నీ బద్నామ్..’ పాటలో నా డ్యాన్స్ అందరూ మెచ్చుకున్నారు.
నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మా అమ్మ మేధా నా బెస్ట్ ఫ్రెండ్. ఏ విషయమైనా అమ్మతో షేర్ చేసుకుంటాను. సినిమాల్లోకి రాకముందు మాడలింగ్ చేశాను.