Sai Pallavi | సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తాజాగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు గురవుతున్నారు. ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముంబైలో ‘ఏక్ దిన్ కీ మెహఫిల్’ పేరిట సంగీత వేడుక నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సాయి పల్లవి అతిథులు, మీడియాను ఉద్దేశించి హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తనకు హిందీ భాషపై పూర్తిగా పట్టు లేదని ఆమె నిజాయితీగా చెప్పడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఆమె తడబడుతూ మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, ముఖ్యంగా ఉత్తర భారత ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న విషయం చర్చకు వచ్చింది. కనీసం హిందీ రాని నటిని సీత పాత్రకు ఎలా ఎంపిక చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం సరైనది కాదని, ఇది తప్పు ఎంపిక అంటూ సామాజిక మాధ్యమ వేదికలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే సినిమాలో సాయి పల్లవి స్వయంగా డబ్బింగ్ చెబుతారా లేదా వేరొకరితో చెప్పిస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విమర్శలకు సాయి పల్లవి అభిమానులు గట్టిగా ప్రతిస్పందిస్తున్నారు. గతంలో కత్రినా కైఫ్, జాక్వెలిన్ వంటి నటీమణులు కూడా హిందీ రాకపోయినా బాలీవుడ్లో సక్సెస్ అయ్యారని గుర్తుచేస్తున్నారు.
నటన అనేది భాషకు మాత్రమే పరిమితం కాదని, భావోద్వేగాలను వ్యక్తపరచడమే అని వారు అంటున్నారు. గాయకులు అర్థం పూర్తిగా తెలియకపోయినా అనేక భాషల్లో పాటలు పాడినట్లే, నటీనటులు కూడా ఏ భాషలోనైనా అద్భుతంగా నటించగలరని వాదిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో మాట్లాడే భాషకు, తెరపై చూపించే నటనకు నేరుగా సంబంధం ఉండదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. సినిమాలో సాయి పల్లవి తన పాత్రను సమర్థంగా పోషిస్తే చాలని, కేవలం భాష ఆధారంగా విమర్శించడం సరికాదని చెబుతున్నారు. ఇక సాయి పల్లవి నటించిన ‘ఏక్ దిన్’ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించగా, జునైద్ ఖాన్‌తో కలిసి నటించారు. ఈ ప్రేమ కథా చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.