Sai Pallavi | సాయిపల్లవి అనగానే.. సంప్రదాయబద్ధమైన భారతీయ స్త్రీ గుర్తొస్తుంది. తను వేడుకల్లోనే కాదు, సినిమాల్లోనూ వేషధారణ విషయంలో ఎక్కడా పరిధులు దాటలేదు. సాయిపల్లవి నటించిన ‘అమరన్’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నది సాయిపల్లవి. ‘మెడిసన్ చేయడానికి జార్జియా వెళ్లి అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకున్నా. ఆ డ్యాన్స్‌కి ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. నాట్యధర్మానికి అనుగుణంగా అవి ధరించి చేస్తేనే ఆ నాట్యానికి అందం. అందుకే.. వాటిని ధరించక తప్పలేదు.
అది కూడా నేను సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ కాస్ట్యూమ్స్ ధరించా. స్టేజ్‌పై ప్రదర్శన కూడా ఇచ్చా. కొంతకాలానికి ‘ప్రేమమ్’లో అవకాశం రావడం నటిగా బిజీ అయిపోవడం జరిగిపోయింది. కానీ ఉన్నట్టుండి జార్జ్జియాలో నేను చేసిన టాంగో డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం మొదలైంది. పైగా దాని కింద అసభ్యకరమైన కామెంట్లు. నిజంగా చాలా బాధ అనిపించింది. శరీరం కనిపించేలా దుస్తులు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నటిగా మారాక అది ఒక నియమంలా పెట్టుకున్నాను. నా నియమాన్ని గౌరవించిన వారి సినిమాలే చేస్తున్నా. డ్యాన్స్ మీద ప్రేమతో చదుకునే రోజుల్లో చేసిన డ్యాన్స్ వీడియో అది. దానిని ట్రోల్ చేసి, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని చూశారు’ అంటూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి.