తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయిపల్లవి (Sai Pallavi). ఈ బ్యూటీ నేటితో 30వ పడిలోకి అడుగుపెట్టింది. పుట్టినరోజు (Sai Pallavi 30th birthday) సందర్భంగా తన ఫాలోవర్లు, అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ అందించింది సాయిపల్లవి. ఈ బ్యూటీ నటిస్తోన్న కొత్త చిత్రం గార్గి (Gargi). రిచీ ఫేం గౌతమ్ రామచంద్రన్ (Gautham Ramachandran)ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది సాయిపల్లవి. గార్గి సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేయగా..ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సాయిపల్లవి కన్నడలో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం వీడియోలో చూడొచ్చు. ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘నేను ఈ సినిమా గురించి మాట్లాడటానికి నెలల నుంచి ఎదురుచూస్తున్నా. ఫైనల్ గా టీం పట్టుబట్టి మరీ అప్డేట్ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పుడు..నా పుట్టినరోజు సందర్భంగా గార్గి వీడియో అందిస్తున్నానంటూ’ ట్వీట్ చేసింది సాయిపల్లవి. ఇంగ్లీష్ టైటిల్‌తో కూడా పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.
96 మూవీ ఫేం గోవింద్ వసంత ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.