Sai Pallavi | కథానాయికగా అడుగుపెట్టిన వేళావిశేషం. అనతికాలంలోనే అద్భుతమైన పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్నది అగ్ర నటి సాయిపల్లవి శంతామరై. తొమ్మిదేళ్ల కెరీర్. చేసింది 19 సినిమాలు. ఈ కాస్త పిరియడ్‌లోనే ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఇప్పటివరకూ ఆరు ఫిల్మ్‌ఫేర్స్ అందుకున్న కథానాయిక దేశంలోనే లేరు. పాతతరం కథానాయిక నూతన్ సమర్ధ్, సీనియర్ కథానాయిక కాజోల్, అలియాభట్, వీరితోపాటు సాయిపల్లవి ఇప్పటివరకూ తలా అయిదుసార్లు ఫిల్మ్ఫేర్లు అందుకొని టాప్ లిస్ట్ ఉన్నారు.
రీసెంట్గా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో అందర్నీ వెనక్కినెట్టి ఆరో ఫిల్మ్‌ఫేర్‌కు ఎంపికయ్యింది సాయిపల్లవి. ఇది నిజంగా గొప్ప విషయం. తొలి సినిమా ‘ప్రేమమ్’, తొలి తెలుగు సినిమా ‘ఫిదా’, శ్యామ్‌సింగరాయ్, లవ్‌స్టోరీ, గార్గీ సినిమాలకు గాను అయిదుసార్లు ఫిల్మ్ఫేర్లు అందుకున్న సాయిపల్లవి, 2022 సంవత్సరానికి గాను ‘విరాటపర్వం’ సినిమాకు బెస్ట్ యాక్ట్రస్‌గా ఆరోసారి ఫిల్మ్‌ఫేర్‌ని అందుకోనున్నది. పైగా వాటిలో నాలుగు తెలుగు సినిమాలే కావడం విశేషం. ఈ సందర్భంగా సాయిపల్లవిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.