‘ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కానీ అలాంటిదే. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకొని ‘రాజు వెడ్స్ రాంబాయి’ అని రాస్తుంటాడు. ఆ తర్వాత ఈ ప్రేమికులకు ఏం జరిగిందనేది మాత్రం తెరపైనే చూడాలి.’ అని దర్శకుడు సాయి కంపాటి అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన వైవిధ్య కథాచిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. అఖిల్, తేజస్విని జంటగా నటించారు. రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా శనివారం దర్శకుడు సాయి కంపాటి విలేకరులతో మాట్లాడారు. దర్శకుడు వేణు ఊడుగుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ సమయంలోనే ఆయనకు ఈ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఓ డెమో షూట్ చేసుకొని రమ్మన్నారు. అది చూశాక సినిమా అవకాశం ఇచ్చారు. నా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన ఈ సినిమాకు ప్రేరణ. మా ఊళ్లో ఏమైనా గొడవలు జరిగితే అన్నలు వచ్చి ఇష్యూని సెటిల్ చేసేవాళ్లు. అలాంటి ఓ సమస్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇందులో హీరో అఖిల్, నేనూ ఇద్దరం వరంగల్ వాసులమే.
నా కథలో హీరో రాజు పాత్రకు కావాల్సిన అర్హతలన్నీ అఖిల్‌లో ఉన్నాయి. అయితే.. హీరోయిన్ రాంబాయి పాత్రను వెతకడానికి మాత్రం కష్టపడాల్సొచ్చింది. తేజస్విని రూపంలో సరైన కథానాయిక దొరికింది. దివ్యాంగుడైన హీరోయిన్ తండ్రి పాత్రకు చైతన్య జొన్నలగడ్డను తీసుకున్నాం. అందరూ పాత్రల్ని ఓన్ చేసుకొని నటించారు.’ అని చెప్పారు సాయి కంపాటి. చిత్రనిర్మాతల్లో ఒకరైన దర్శకుడు వేణు ఊడుగుల సహకారంతో స్క్రిప్ట్‌ని సిద్ధం చేశానని, షూటింగ్ టైమ్‌లో నిర్మాతలు పూర్తి స్వేచ్ఛనిచ్చారని సాయి కంపాటి తెలిపారు.