‘ఇప్పటివరకు తెలుగులో వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఏదో భయపెట్టాలని సీన్స్ పెట్టడం కాకుండా బలమైన కథతో ఉత్కంఠను కలిగించేలా కథనం రాసుకున్నాను.’ అన్నారు సాయికిరణ్ దైదా. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘పిండం’. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు సాయికిరణ్ దైదా మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటినుంచీ రచనపై ఆసక్తి ఉంది. కాలేజ్ టైమ్‌లో బ్లాగ్స్ రాసేవాడిని. యూఎస్‌లో వ్యాపారం చేస్తూ కూడా కథా రచన కొనసాగించాను. ఇక ఈ సినిమా విషయానికొస్తే…నల్గొండ జిల్లాలో జరిగిన ఓ యథార్థ సంఘటన చుట్టూ అల్లుకున్న కల్పిత కథ ఇది.
‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనే ట్యాగ్‌లైన్ తరహాలోనే ప్రేక్షకుల్ని బాగా భయపెడుతుంది. ఈ సినిమా టైటిల్ నెగెటివ్‌గా ఉంది.. మార్చమని చాలా మంది నాతో అన్నారు. కథకు సరిగ్గా సరిపోయేలా టైటిల్ పెట్టాం. సినిమా చూస్తే ఈ టైటిల్ పెట్టడం కరెక్టే అనిపిస్తుంది. 1990లో జరిగే ఈ కథకు హీరో శ్రీరామ్ బాగా సెట్ అయ్యారు. క్లైమాక్స్ షూటింగ్ టైమ్‌లో సెట్లో కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో మరిత శ్రద్ధగా పనిపై దృష్టి పెట్టాం. హారర్‌తో పాటు ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఉంటాయి. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ చదివాను. రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశా. ‘కృష్ణుడిలంక’ పేరుతో నా తదుపరి చిత్రాన్ని చేయబోతున్నా. ఇంకా హీరోను ఖరారు చేయలేదు. ఆ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తాను’ అన్నారు.