Sai Durga Tej | టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ రెండో ఇన్నింగ్స్‌ను ఎంతో స్పూర్తిదాయకంగా మలుస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం అనంతరం, ఆయన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులు ఇప్పుడు అతన్ని సామాజికంగా చైతన్యవంతంగా మార్చాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ లో పాల్గొన్న సాయితేజ్ పిల్లలపై లైంగిక దాడుల గురించి ఘాటుగా మాట్లాడారు. చిన్న పిల్లలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి కామెంట్లపై నవ్వడం, లైక్ చేయడం సిగ్గుచేటు. ఎవ్వరూ ఈ విషయంలో స్పందించకపోవడంతో నేను స్పందించాల్సి వచ్చింది,” అంటూ సమాజంపై తన బాధను వ్యక్తం చేశారు.వాక్ స్వాతంత్య్రం పేరుతో ఎదుటివారిని కించపరిచే కామెంట్లు చేయడం తగదు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి భద్రత మన బాధ్యత అంటూ చెప్పారు.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా ఈ సందర్భంగా సాయితేజ్ పంచుకున్నారు. “నాకు రెండో తరగతిలో ఒక అమ్మాయిపై ఇష్టం ఏర్పడింది. అప్పుడు నేను మా అమ్మకు ఏదీ దాచకుండా నేరుగా చెప్పేశా. మా అమ్మ కూడా నన్ను ఓపెన్‌గా ఎంకరేజ్ చేసింది. పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి. వారు తమ మనసులోని విషయాలను తల్లిదండ్రులతో పంచుకునేలా ప్రోత్సహించాలి అని అన్నారు. ఇక తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. 2023లో నాకు బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ మీడియా వల్లే జరిగింది. మీడియా వాళ్లు నాపై ప్రేమతో ఈ అమ్మాయితో పెళ్లి, ఆ అమ్మాయితో పెళ్లి.. ఆ సినిమా హిట్టైంది అంటూ ఊపిరి పీల్చుకోనివ్వకుండా చాలా వార్తలు రాసారు. దాని వలన నా లవ్ బ్రేకప్ అయింది. నా కాలేజ్ గార్ల్ ఫ్రెండ్ ఈ మీడియా కథనాలని భరించలేక ఆందోళనకు గురైంది.
మీడియా వాళ్లు నా పెళ్లి బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నా. దయచేసి మీడియా సైలెంట్ గా ఉంటే నా మ్యారేజ్ గురించి నేనే అనౌన్స్ చేస్తా. అప్పటి వరకు మీరందరూ కామ్ గా ఉంటే నా పెళ్లి గురించి నేనే ప్రకటిస్తా అని సాయి దుర్గ తేజ్ తెలిపారు. ఇక సామాజిక బాధ్యతలలో భాగంగా తాను 2015లో థింక్ పీస్ అనే సంస్థతో కలిసి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం పని చేశానని, అరకులో స్కూల్ నిర్మించానని, అక్కడి కొందరు పిల్లలను దత్తత తీసుకొని వారి విద్యా, పోషణ బాధ్యతలు తనవంతు కింద తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడి, జీవితాన్ని మరింత బాధ్యతతో ముందుకు తీసుకువెళుతున్న సాయి తేజ్ నేడు కేవలం హీరో మాత్రమే కాదు, ఒక బాధ్యత గల వ్యక్తిగా, సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. పిల్లల భద్రత, కుటుంబ విలువలు, వ్యక్తిగత నైతికత ఇవన్నీ ఆయన వ్యాఖ్యల్లో చక్కగా కనిపించాయి.