సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో, ఆయన 43వ సినిమాగా ‘వేదవ్యాస్’ చిత్రం రూపొందుతున్నది. కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిల్మ్స్ పతాకంపై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ఇందులో కథానాయికగా నటిస్తున్న సౌత్ కొరియా నటి జున్ హ్యూన్జీకి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ‘హలో కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్’ అంటూ బొకే అందించగా, ఆమె బొకే అందుకొని ‘థాంక్యూ సార్..’ అనడాన్ని ముహూర్తపు షాట్‌గా చిత్రీకరించారు.
ఈ షాట్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అతిథులంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘తెలుగుమూవీలో తొలిసారి ఓ కొరియన్ హీరోయిన్ని పరిచయం చేస్తున్నాం. జున్ హ్యూన్ జీ మా సినిమాలో భాగం అవ్వడం మా అందరికీ గొప్ప అవకాశం. అందరూ మెచ్చేలా ఈ సినిమా రూపొందిస్తాం.’ అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. మురళీమోహన్, సుమన్, సాయికుమార్, మురళీశర్మ, అజయ్‌ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: శరత్, కథ, కథనం, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.