SS Thaman | ‘సంగీత దర్శకుడిగా నేను ఈ రోజు వున్న స్థాయికి రావడానికి 25 ఏళ్ళు పట్టింది. నేర్చుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను’ అన్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్నారు థమన్. ఆయన సంగీతం అందిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. పవన్‌కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ కలయికలో పి.సముద్రఖని దర్శకత్వలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించిన థమన్ ‘బ్రో’ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
‘బ్రో’ చిత్రంలో మీ సంగీతం ఎలా వుండబోతుంది?
భీమ్లా నాయక్ తరహాలో ‘బ్రో’ సినిమాలో మాస్ పాటలు వుండవు. సినిమాకి ఎలాంటి పాటలు అవసరమో అలాంటి పాటలు స్వరపరుస్తాను. సంగీతమైనా, సాహిత్యమైనా సినిమాలోని సందర్భానికి తగ్గట్టుగానే వుంటాయి. నేపథ్య సంగీతంలోనూ కొత్తదనం కనిపిస్తుంది.
పవన్‌కళ్యాణ్ చిత్రానికి మ్యూజిక్ చేయడం ప్లెజరా? ప్రెజరా?
ఒక అభిమానిగా ప్లెజర్, అభిమానుల నుంచి ప్రెజర్ (నవ్వుతూ). అలాంటి ఒత్తిడి వున్నప్పుడే మన అనుభవం ఉపయోగపడుతుంది. సినిమాని బట్టి సంగీతం వుంటుంది.
రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం ఛాలెంజ్‌గా ఫీలవుతున్నారా?
ఎవరెస్ట్‌ని అధిరోహించడం లాంటిది. నాకు పవన్‌కల్యాణ్ గారితో మూడు సినిమాలు రీమేక్‌లే వచ్చాయి. ఆ చిత్రాలకు సంగీతపరంగా నేను చేయాల్సింది చేస్తున్నాను. సాంగ్స్ సినిమాకు హెల్ప్ చేస్తాయి.
మాతృక ప్రభావం మీ సంగీతంపై వుందా?
ఒరిజినల్ ఫిల్మ్‌లో పాటల్లేవు. నేపథ్య సంగీతం బాగా చేశారు. అక్కడ ఆ పాత్ర సముద్రఖని చేశారు కాబట్టి పాటలు లేకపోయినా ఫర్వాలేదు. కానీ ఇక్కడ పవన్‌కల్యాణ్ కాబట్టి ఎక్కువ వర్క్ చేయాల్సి వుంటుంది. ఆయన తెర మీద కనిపిస్తే చాలు సంగీతం అడిగేస్తాం. అందుకే ‘బ్రో’ శ్లోకం స్వరపరిచాం. నేపథ్య సంగీత పరంగా చాలా సంతోషంగా వున్నాను. ఉన్నతస్థాయిలో వుంటుంది.
‘గుంటురు కారం’ సినిమా సంగీతపరంగా ఎలా వుంటుంది?
ఆరు నెలల నుంచి సంగీతపరంగా వర్క్ జరుగుతుంది. బయటి ప్రచారాలను పట్టించుకోవద్దు. కొన్ని సార్లు సినిమా ఆలస్యమవ్వడం అనేది సహజం. దానిని భూతద్దంలో పెట్టి చూస్తూ పదే పదే దాని గురించి రాయాల్సిన అవసరం లేదు.
ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు?
నేను ఈ స్థాయికి రావడానికి 25 ఏళ్లు పట్టింది. నేర్చుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను. ఒత్తిడిని తట్టుకుని పనిచేయడం నేర్చుకున్నాను. గతంలో ఒకే ఏడాది నేను పనిచేసిన పదికిపైగా సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ని సినిమాలు చేతిలో వున్నా, నా వల్ల ఎప్పుడూ ఆలస్యం అవ్వదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి సమయానికి సంగీతం పూర్తిచేస్తాను.
మీ మీద వచ్చే సోషల్‌మీడియా ట్రోల్స్‌ని పట్టించుకుంటారా?
ట్రోల్స్ చూస్తుంటాను. అందులో మంచిని తీసుకుంటాను. చెడును పక్కన పెట్టేస్తాను. ప్రశంసలు తీసుకున్నప్పుడు, విమర్శలు కూడా తీసుకోవాలి. నేను సంగీతం మీద ఎంత శ్రద్ధ పెడతానో, సంగీతం కోసం ఎంత కష్టపడతానో నా దర్శక, నిర్మాతలకు తెలుసు. కొందరు ఏదో కావాలని సోషల్‌మీడియాలో విమర్శలు చేస్తే, మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.