Indian-2 Movie | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇండియన్-2 ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శంకర్ డైరెక్షన్, కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. ఇక ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎస్ జే సూర్య కూడా భాగం అయ్యాడట. ఈ సినిమాలో నటిస్తున్నట్లు తాజాగా ఆయనే కన్ఫర్మ్ చేశాడు. తన పాత్రేంటో రివీల్ చేయలేదు కానీ.. ఈ సినిమాలో ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు చెన్నై టాక్. ఆయన రోల్ కూడా చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఎస్జే సూర్య.. శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం మొదటగా సంక్రాంతిని టార్గెట్ పెట్టుకున్నా.. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో సమ్మర్‌కు వాయిదా పడే చాన్స్ ఉంది.
కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. స్వర మాంత్రికుడు రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను రెడ్ జియాంట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఇండిపెండెన్స్ డేకు రిలీజైన కమల్ లుక్కు విశేష స్పందన వచ్చింది.