కన్నడ సొగసరి రుక్మిణి వసంత్‌కు కెరీర్లో బ్రేక్ రావడానికి కాస్త సమయం పట్టింది. అయితే రెండేళ్ల క్రితం వచ్చిన కన్నడ చిత్రం ‘సప్తసాగరాలు దాటి’ ఆమె సినీ ప్రయాణాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఈ చిత్రంలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పుడీ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే. ‘కాంతార చాప్టర్-1’లో ఈ భామ కనకావతి అనే పాత్రను పోషిస్తున్నది. ఇటీవలే ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తాజా ఇంటర్వ్యూలో ‘కాంతార చాప్టర్-1’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రుక్మిణి వసంత్.
చిత్ర హీరో, దర్శకుడు రిషబ్‌శెట్టి సినిమా కోసం తనను సంప్రదించినప్పుడు ఆనందానికి అవధులు లేకుండా పోయానని, తన కల నిజమైందనే భావన కలిగిందని రుక్మిణి వసంత్ పేర్కొంది. “కాంతార చాప్టర్-1’ నా కెరీర్లో చాలా ప్రత్యేకం. చిత్రబృందం కోరిక మేరకు సినిమాలో నేను నటిస్తున్న విషయం కానీ, నా పాత్ర గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఆ విషయాన్ని ఓ రహస్యంగా దాచి ఉంచాను. కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో నా పాత్ర గురించి అందరికీ తెలిసింది’ అని రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో ‘మదరాసి’, కన్నడంలో యష్ ‘టాక్సిక్’లో నాయికగా నటిస్తున్నది.