కన్నడ అనువాద చిత్రం ‘సప్తసాగరాలు దాటి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది కథానాయిక రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదిలో వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉంది. ‘కాంతార చాప్టర్-1’ ‘యష్’ ‘మదరాసి’ వంటి భారీ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ కాంబోలో రానున్న ‘డ్రాగన్’లో (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) ఈ భామను కథానాయికగా ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ చిత్రం కోసం ఆమె దాదాపు రెండుకోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నదని తెలిసింది.
దక్షిణాది యువతలో ఈ సొగసరి మంచి ఫాలోయింగ్ ఉండటంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ‘డ్రాగన్’ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో ఆమె అడిగినంత పారితోషికాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే అన్నారని సమాచారం. 2019లో సినీరంగ ప్రవేశం చేసిన రుక్మిణి వసంత్‌కు బ్రేక్ రావడానికి చాలా సమయం పట్టింది. ‘సప్తసాగరాలు దాటి’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అక్కడి నుంచి భారీ ఆఫర్లొస్తున్నాయి.