Rukmini Vasanth | కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తోంది. కాంతార చాప్టర్ 1 చిత్రంలో యువరాణి కనకవతి అనే ప్రతినాయిక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రుక్మిణి, తన కెరీర్లో తొలి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన ఆనందాన్ని ఇప్పటికీ ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది.తెలుగు, కన్నడ చిత్రసీమలకు ఇప్పటికే పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో తమిళ చిత్రాల్లోనూ క్రేజీ ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌పై తన ఆసక్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన రుక్మిణి, హిందీ భాషతో తనకున్న అనుబంధమే అక్కడ నటించాలనే తపనకు కారణమని చెప్పింది.
హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “హిందీ నాకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న భాష. మా కుటుంబానికి సైనిక నేపథ్యం ఉండటంతో, వివిధ కంటోన్మెంట్ల మధ్య అనుసంధాన భాషగా హిందీ ఉండేది. అందుకే ఆ భాషపై నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటివరకు హిందీలో నటించే అవకాశం రాలేదు. కానీ, ఆ భాషలో నా ప్రతిభను నిరూపించుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను. దేవుడి దయతో త్వరలోనే ఆ ప్రయాణం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాను” అని తెలిపింది.రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 విడుదలై సంచలన విజయం సాధించగా, ఇందులో రుక్మిణి వసంత్ ప్రతినాయిక పాత్రలో కనిపించి ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చింది.
ఆమె అందచందాలు, నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ సినిమా విజయం ఇచ్చిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని చెప్పిన రుక్మిణి, త్వరలో కాంతార టీమ్ అంతా కలిసి విజయోత్సవాన్ని జరుపుకుంటామని వెల్లడించింది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, జార్ఖండ్ సహా దేశం నలుమూలల నుంచి వస్తున్న స్పందనలు తనను ఎంతో ఉత్సాహపరుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్ ఎంట్రీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రుక్మిణి వసంత్ కెరీర్ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.