ప్రేమపై తనకు గొప్ప విశ్వాసముందని..భవిష్యత్తులో తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పింది యువ కథానాయిక రుక్సర్ థిల్లాన్. ‘ఏబీసీడీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాల ద్వారా యువతరానికి చేరువైందీ భామ. ప్రస్తుతం ఆమె విష్వక్సేన్తో కలిసి ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ చిత్రంలో నటిస్తున్నది. విద్యాసాగర్ చింతా దర్శకుడు. ఈ నెల 6న విడుదలకానుంది. చిత్ర కథానాయిక రుక్సర్ థిల్లాన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ కథ వినగానే ఎంతగానో నచ్చింది. ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటుంది. నా పాత్ర కూడా భావోద్వేగాలతో సాగుతుంది. ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రేమకథలతో పాటు అభినయపరంగా సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించాలనుంది. భవిష్యత్తులో తల్లిదండ్రుల్ని ఒప్పించి లవ్‌మ్యారేజ్ చేసుకుంటా. చిన్న పాత్ర చేసినా కథాగమనంలో దానికి ప్రాముఖ్యత ఉండాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం ఆమెజాన్ కోసం హిందీలో ఓ సినిమా చేస్తున్నా. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’ అని చెప్పింది.