హీరోలందరి అభిమానులకూ ఇష్టుడైన నటుడు డా.రాజశేఖర్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. జనరేషన్ మారింది. కొత్త నీరు వచ్చింది. పాత కథలకు కాలం చెల్లింది. ఆడియన్స్ అభిరుచి మారింది. దాంతో ఈ జనరేషన్‌కి తగ్గట్టు తనను తాను మలుచుకునే పనిలో ఉన్నారు రాజశేఖర్. సరైన సెకండ్ ఇన్నింగ్స్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారాయన. అందులో భాగంగానే తమిళ సూపర్‌హిట్ ‘లబ్బర్ పందు’ చిత్రం రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారట. ‘లబ్బర్ పందు’ అంటే తెలుగులో ‘లబ్బర్ బంతి’ అని అర్థం. ఇది ఓ ఆడపిల్ల తండ్రి కథ. ఆ తండ్రికి క్రికెట్ అంటే ఇష్టం. తన కూతురు ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ కుర్రాడికి కూడా క్రికెట్ అంటే ఇష్టం. ఈ విధంగా క్రీడా నేపథ్యంలో సరదాగా, భావోద్వేగాల మధ్య ఈ ప్రేమకథ సాగుతుంది. ఇందులో పెళ్లీడు కూతురుకి తండ్రిగా వయసుకు తగ్గ పాత్రలో నటించేందుకు రాజశేఖర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ సినిమా దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలో వెల్లడికానున్నట్టు తెలుస్తున్నది.