Karisma kapoor | దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయనకు చెందిన దాదాపు రూ. 30,000 కోట్ల విలువైన ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య పెద్ద స్థాయిలో వివాదం నెలకొంది.ఈ నేపథ్యంలో సంజయ్ కపూర్ మొదటి భార్య కరిష్మా కపూర్ పిల్లలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి ఆస్తిలో వారికీ చట్టబద్ధమైన హక్కు ఉన్నప్పటికీ, మూడవ భార్య ప్రియా కపూర్ దాన్ని అడ్డుకుంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రియా కపూర్, ఇద్దరు వ్యక్తులు (దినేష్ అగర్వాల్, నితిన్ శర్మ) కలిసి నకిలీ వీలునామా సృష్టించారని ఆరోపణలు వచ్చాయి.
2025 మార్చి 21న రాసినట్లు చెప్పబడుతున్న ఆ వీలునామా ప్రకారం, సంజయ్ కపూర్ తన వ్యక్తిగత ఆస్తి మొత్తాన్ని ప్రియా కపూర్ పేరు మీద రాసిచ్చినట్లు ఉంది. పిటిషనర్లు ఈ వీలునామా అసలు కాపీ కూడా ఇవ్వలేదని, కేవలం జూలై 30, 2025న కుటుంబ సభ్యుల ముందు వీలునామా గురించి చెప్పారని కోర్టులో తెలిపారు. ఇది పెద్ద కుట్రలో భాగమని, తమకు న్యాయం జరగదని భావించి కోర్టుకి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రియా కపూర్‌తో పాటు ఆమె కుమారుడు, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, అలాగే వీలునామాను అమలు చేసే వ్యక్తి శ్రద్ధా సూరి మార్వా ప్రతివాదులుగా ఉన్నారు.
కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి ఆస్తిలో ఐదు వంతుల్లో ఒక వంతు వాటా ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాక, ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు సంజయ్ కపూర్ వ్యక్తిగత ఆస్తులను ఫ్రీజ్ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. సంజయ్ కపూర్ యుకేలో హఠాత్తుగా మరణించిన తర్వాత ఈ ఆస్తి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయన కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు కోర్టు తలుపులు తట్టడంతో వివాదం మరింత ముదురనుంది. ఇక ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.