
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కానున్నట్టు కొద్ది రోజులుగా ప్రకటిస్తుండగా, అభిమానులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి వంటి క్రేజీ డైరెక్టర్, ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.వాటిని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడిన ప్రమోషన్ డైలాగ్స్‌తో ఉండే ఓ స్పెషల్ ప్రోమో వీడియో కట్ చేసే పనిలో ఉన్నారట రాజమౌళి. ఈ వీడియోను వచ్చే నెల ఆరంభంలోనే అందరి ముందు పెట్టాలని భావిస్తున్నారట.
ఈ వీడియో అభిమానులకి మంచి కిక్ ఇవ్వడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలు పెంచుతుందని అంటున్నారు.ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని మొదటి పాట (దోస్తీ) విడుదల చేయగా పలు రికార్డులు తిరగరాస్తూ ఫుల్ క్రేజ్ అందుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట అన్నివర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ సత్తా చాటుతుంది.
ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌లో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 19తో ఉక్రెయిన్ షెడ్యూల్ కంప్లీట్ కానుందనేది లేటెస్ట్ సమాచారం. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు.