రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచవేదికపై తెలుగు సినిమా సత్తాను చాటింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుపొంది భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ విశేషాలతో ‘ఆర్ఆర్ఆర్’ (బిహైండ్ అండ్ బియాండ్) అనే డాక్యుమెంటరీని రూపొందించారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ డాక్యుమెంటరీని ఈ నెలలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మేకింగ్ సందర్భంగా జరిగిన సంఘటనలు, పోరాట ఘట్టాల రూపకల్పనకు సంబంధించిన విశేషాలతో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించినట్లుగా తెలిసింది. ‘ఇప్పటికే ప్రపంచం ఈ సినిమా తాలూకు వైభవాన్ని చూసింది.
అసలు దీని వెనక కథేమిటో చూడండి’ అంటూ డాక్యుమెంటరీ గురించి ‘ఆర్ఆర్ఆర్’ బృందం సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘ఇంటర్స్టెల్లార్’ డాక్యుమెంటరీ తరహాలో ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీని పరిమిత స్క్రీన్లలో ప్రదర్శించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆగస్ట్‌లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘మోడరన్ మాస్టర్స్’ పేరుతో దర్శకుడు రాజమౌళిపై డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో రాజమౌళి ఫిల్మ్‌మేకింగ్, గ్లోబల్ సక్సెస్‌తో పాటు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను చూపించారు. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమా సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని అడ్వెంచరస్ కథాంశంతో తెరకెక్కించనున్నారు. ‘గరుడ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.