‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట లిఖించుకుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మే 20నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. కాగా తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా పదివారాల పాటు ట్రెండ్ అయిన నాన్ ఇంగ్లీష్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాకుండా ఓటీటీలోనూ వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు.