“రౌడీబాయ్స్’లో ఎనిమిది పాటలుంటాయి. దేవిశ్రీప్రసాద్ ప్రతి పాటకు అద్భుతమైన స్వరాల్ని అందించాడు’ అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. స్వీయనిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘రౌడీబాయ్స్’. ఆశిష్ (నిర్మాత శిరీష్ తనయుడు) హీరోగా పరిచయమవుతున్నాడు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌సాంగ్‌ను శుక్రవారం ఏపీలోని విశాఖపట్నంలో విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘ప్రేమదేశం, హ్యాపీడేస్ చిత్రాలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఆ సినిమాల స్థాయి కథాంశం కావాలని దర్శకున్ని కోరాను. తన కాలేజీ జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ సబ్జెక్ట్ తయారుచేశాడు. రెండు కాలేజీల ఇంజనీరింగ్ విద్యార్థుల నడుమ జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఆసక్తికకంగా ఉంటుంది. మీ అందరి కాలేజీ కథ ఇది. దసరాకు విడుదల చేయాలనుకుంటున్నాం’ అన్నారు. ఈ పాటకు హీరో అశిష్ అద్భుతంగా స్టెప్పులేశాడని గాయకుడు రోల్‌రైడా చెప్పారు. నేటి యువతకు నచ్చే అన్ని అంశాలున్న చిత్రమిదని దర్శకుడు తెలిపారు.