Rowdy Boys Review | ప్రతి సంక్రాంతికి సినిమాను విడుదల చేసే నిర్మాత ‘దిల్’రాజు ఈ సారి ‘రౌడీబాయ్స్’ రూపంలో ఓ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పెద్దచిత్రాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో సంక్రాంతికి ‘రౌడీబాయ్స్’కు స్లాట్ దొరికింది. ఈ చిత్రంతో దిల్‌రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమయ్యారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ప్రచారచిత్రాలు, పాటలతో ఇదొక యూత్‌ఫుల్ సినిమాగా ముద్ర వేసుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి ఏర్పడింది. అంతేకాకుండా దిల్‌రాజు కుటుంబం నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా కోసం అందరిలోనూ సినిమాపై ఓ అంచనాలు ఏర్పడ్డాయి.
ఎటువంటి లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే యువకుడు అక్షయ్ (అశిష్). లెగసీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతుంటాడు. బ్రహ్మం మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కావ్య(అనుపమ పరమేశ్వరన్)ను చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడతాడు అక్షయ్. అయితే ఈ రెండు కాలేజీల విద్యార్థులకు ఎప్పటి నుంచో గొడవలు జరుగుతుంటాయి. ఒకరంటే ఒకరికి అసలు పడదు. కావ్యతో కలసి మెడిసిన్ చదువుతున్న విక్రమ్ (విక్రమ్) కూడా కావ్యను ప్రేమిస్తుంటాడు. ఇక కావ్యని తమ ప్రత్యర్థి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అక్షయ్ ఇష్టపడుతున్నాడని తెలిశాక విక్రమ్ అతడిపై కక్ష సాధించే ప్రయత్నం చేస్తుంటాడు. కావ్య డాన్స్ పర్ఫార్మన్స్ను చూడటం కోసం దొంగచాటుగా మెడికల్ కాలేజీలోకి ప్రవేశించిన అక్షయ్‌ని విక్రమ్ అండ్ గ్యాంగ్ కొడతారు. అనంతరం జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలతో అక్షయ్, కావ్య లివింగ్ రిలేషన్షిప్లో వుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్లిద్దరి ప్రేమకథ ఎలా గెలిచింది? రౌడిబాయ్స్ ఏం చేశారు అనేది వెండితెరపై చూడాలి.
ప్రేమకథలు, కాలేజీ కథలు ఎన్ని వచ్చినా.. అందులో కొంచెం కొత్తదనం వున్నా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బహుశా కొత్తహీరోని పరిచయం చేయడానికి దర్శక, నిర్మాతలకు ఇలాంటి కథలకు మించిన ఆప్షన్ ఇంకొటి లేదేమో..? చాలా సింపుల్కథకు కాలేజీ నేపథ్యం, ఎంటర్టైన్మెంట్ను జోడించి కథ చాలా ఫాస్ట్‌గా సరదాగా సరదాగా కొనసాగుతుంది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలను కూడా ఎటువంటి హంగులు లేకుండా దర్శకుడు చాలా సింపుల్‌గా తెరకెక్కించాడు. కాలేజీల మధ్య వుండే గ్యాంగ్‌వార్ సన్నివేశాలను చాలా గ్రాండ్‌గా రూపొందించారు. విక్రమ్‌కు-అజయ్‌కు మధ్య నడిచే సన్నివేశాల్లో ఇంకాస్త బలంగా వుండే బాగుండు అనిపించింది.
వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, ఈ ముక్కోణపు ప్రేమకథను చూస్తుంటే ‘దిల్’రాజు నిర్మాతగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తొలిచిత్రం ‘ఆర్య’కు గుర్తుకు వస్తుంది. అయితే ఆ చిత్రంలో మాదిరిగా ఈ చిత్రంలో కూడా అక్షయ్-విక్రమ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు బలంగా వుండే సినిమా రేంజ్ మరింత పెరిగి వుండేదనిపించింది. అయితే సన్నివేశాల రూపకల్పనలో వున్న దర్శకుడి బలంతో సినిమా ఆసక్తిగానే కొనసాగింది. అక్షయ్ డబ్బుల కోసం ఆర్కెస్ట్రా బ్యాండ్‌లో జాయిన్ కావడం, పాటలు పాడటం ఆ సన్నివేశాలు వినోదాన్ని పంచాయి. అక్షయ్‌కు, కావ్య తండ్రికి మధ్య వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాలు, అక్షయ్, కావ్యల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అందరి మనసుకు హత్తుకునే విధంగా తెరకెక్కించారు దర్శకుడు. సినిమాలో వున్న నిర్మాణ విలువలు సినిమాకు గ్రాండ్ లుక్‌ను తీసుకొచ్చాయి.
అక్షయ్ పాత్రలో హీరో ఆశిష్ ఎటువంటి తడబాటు లేకుండా నటించాడు. ప్రతి సన్నివేశంలో పరిణతితో కూడిన నటనను ప్రదర్శించాడు. డ్యాన్స్‌ల్లో, ఫైట్స్‌లో ప్రతిభను చూపాడు. హీరోగా ఆశిష్‌కు మంచి భవిష్యత్ వుంది. కావ్యగా అనుపమ పరమశ్వేరన్ ఒదిగిపోయింది. ఈ సినిమాలో అనుపమ కాస్త బోల్డ్‌గానే కనిపించింది. లిప్‌లాక్ సన్నివేశాలు యూత్‌ను ఆకట్టుకునే విధంగా వున్నాయి. భావోద్వేగ సన్నివేశాల్లో అనుపమ నటన మెచ్యూర్డ్‌గా వుంది. విక్రమ్ పాత్రలో సహిదేవ్, కార్తిక్ రత్నం, తేజ్కూరపాట,శ్రీకాంత్ అయ్యంగార్, తదితరలు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి పాత్రను ఎంతో సహజంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. దర్శకుడిగా శ్రీహర్ష ప్రతి సన్నివేశాన్ని మనసుకు హత్తుకునేలా తెరకెక్కించడంలో సఫలీకృతుడయ్యాడు. దేవిశ్రీప్రసాద్ పాటలు సినిమాకు హుషారును తీసుకొచ్చాయి. ఆయన నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా వున్నాయి.
‘రౌడిబాయ్స్’ పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా యూత్‌ను ఆకట్టుకునే విధంగా వుంది. చాలా రోజుల తరువాత ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకు సంక్రాంతి పండగ సీజన్ కలిసి రావడంతో ప్రారంభవసూళ్లతో పాటు మౌత్‌టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం పుష్కలంగా వుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bangarraju Review | ‘బంగార్రాజు’ రివ్యూ
లిప్‌లాక్ సీన్లపై సోషల్‌మీడియాలో ట్రోల్స్.. స్పందించిన అనుపమ పరమేశ్వరన్
Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..
Arjuna Phalguna in OTT | అర్జుణ ఫల్గుణ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న అనుపమ పరమేశ్వరన్..