తారాగణం: అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావురమేష్, సంపత్‌రాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: యువరాజ్
సంగీతం: అనూప్‌రూబెన్స్
నిర్మాత: అక్కినేని నాగార్జున
కథ, దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ కురసాల
ఐదేళ్ల క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం నాగార్జున కెరీర్లో గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఫాంటసీ అంశాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. బంగార్రాజు పాత్రలో నాగార్జున కనబరచిన అద్భుత అభినయం అందరికి గుర్తుండిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించారు. ఇందులో తనయుడు నాగచైతన్యతో కలిసి నాగార్జున నటించడంతో ఈ చిత్రం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమాగా ‘బంగార్రాజు’ ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు నిజం చేసిందో చూద్దాం..
బంగార్రాజు మనవడు చిన్న బంగార్రాజు కథ ఇది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కథ ఎక్కడ ముగిసిందో ‘బంగార్రాజు’ కథ అక్కడే మొదలవుతుంది. తాత పేరు పెట్టుకున్న చిన్న బంగార్రాజు (నాగచైతన్య)ను అతని నానమ్మ సత్యభామ (రమ్యకృష్ణ) అల్లారుముద్దుగా పెంచుతుంది. యుక్తవయస్సుకు వచ్చిన బంగార్రాజు అచ్చం తాత గుణాల్నే పుణికిపుచ్చుకుంటాడు.
సరసవిలాస పురుషుడిగా ఊరిలో చెలామణి అవుతుంటాడు. ఇంతలో అతని నానమ్మ సత్యభామ మరణించి స్వర్గంలో ఉన్న భర్త బంగార్రాజు చెంతకు చేరుకుంటుంది. మనవడి జీవితం ఎలా ఉంటుందోనని దిగులుపడుతుంటుంది. మరోవైపు శివపురం శివాలయంలో ఉన్న గుప్తనిధిపై దుష్టశక్తుల కన్నుపడుతుంది. ఆ దేవాలయాన్ని బంగార్రాజు కుటుంబం తరాలుగా రక్షిస్తుంటుంది.
బంగార్రాజు అడ్డు తొలగించుకుంటేనే తమకు ఆ నిధి దొరుకుతుందని ప్రతినాయకుడు సంపత్ (సంపత్‌రాజ్) కుట్ర పన్నుతాడు. ఈ నేపథ్యంలో స్వర్గంలో ఉన్న బంగార్రాజు, సత్యభామ మనవడిని రక్షించడానికి పూనుకుంటారు. యమధర్మరాజు అనుమతితో బంగార్రాజు కిందకు వచ్చి అవసరమైన సందర్భాల్లో మనవడిలో ఆత్మగా ఆవాహన అవుతుంటాడు. స్వర్గం నుంచి భూలోకానికి
వచ్చిన బంగార్రాజు తన మనవడికి ఎలాంటి సహాయం చేశాడు? శివపురం ఊరి సర్పంచ్ నాగలక్ష్మి (కృతిశెట్టి)తో చిన్న బంగార్రాజు ప్రేమాయణం ఎలాంటి మలుపులు తిరిగింది? దుష్టశక్తులపై ఇద్దరు బంగార్రాజులు కలిసి ఎలా విజయం సాధించారు? అన్నదే చిత్ర కథ.
ఆత్మ, స్వర్గం, దేవుళ్లు వంటి ఫాంటసీ అంశాలతో కూడిన కథల విషయంలో దర్శకులకు అపరిమితమైన సృజనాత్మక స్వేచ్ఛ ఉంటుంది. ప్రధానమైన పాయింట్ చుట్టూ కథను ఎలాగైనా అల్లుకొని చెప్పొచ్చు. లాజిక్‌లకు ఎలాంటి ఆస్కారం ఉండదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మాదిరిగానే ఈ కథ కూడా గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. తాత గుణగణాలు కలిగిన చిన్న బంగార్రాజు ఊరిలో ప్లేబాయ్‌గా చలామణి అవుతుంటాడు. ప్రథమార్థమంతా బంగార్రాజు ఆటపాటలు, సరససల్లాపాలతో వినోదప్రధానంగా సాగింది. సర్పంచ్ నాగలక్ష్మితో బంగార్రాజు సవాళ్లు, ప్రతిసవాళ్లు..అనంతరం వారి మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు వినోదాన్ని పంచాయి. చిన్న బంగార్రాజు ఎప్పుడు కష్టాల్లో ఉన్న తాత పెద్ద బంగార్రాజు ఆత్మ వచ్చి రక్షిస్తుంటుంది. ఆత్మగా పెద్ద బంగార్రాజు చేసే మేజిక్లతో ప్రథమార్థం సరదాగా సాగింది.
కథాగమనంలో చిన్న, పెద్ద బంగార్రాజు పాత్రలు సమాంతరంగా, సమప్రాధాన్యతతో సాగేలా దర్శకుడు రాసుకున్న స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. తొలిభాగంలో భావోద్వేగాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. పూర్తి వినోదంపైనే దృష్టిపెట్టారు. బంగార్రాజును అంతమొందించడానికి సంపత్ చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థంలో వేగం పెరిగింది. అక్కడి నుంచి కథ మలుపులతో సాగుతుంది. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు. ఇందులో ఇద్దరు బంగార్రాజులు, చిన్న బంగార్రాజు తండ్రి రాము ఒకే ఫ్రేములో కనిపించడం బాగుందనిపిస్తుంది. క్లైమాక్స్ ఘట్టాల్ని రొమాంచితంగా తీర్చిదిద్దారు.
నాగలక్ష్మి, బంగార్రాజు మధ్య లవ్‌ట్రాక్ ఏమంత ఆకట్టుకునేలా లేకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. కథ, కథనాలు ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే సాగినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. ఫాంటసీ కథ కాబట్టి లాజిక్ గురించి ఆలోచించకూడదు. పక్కా మాస్ ఫార్ములాతో దర్శకుడు ఈ సినిమాను నడిపించాడు.
నయనానందకరంగా అనిపించే గ్రామీణ వాతావరణం, గుడి నేపథ్యంలో సాగే దైవిక అంశాలు, తాతమనవడి సెంటిమెంట్ అంశాల చుట్టూ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్.. బంగార్రాజులుగా నాగార్జున, నాగచైతన్యల చుట్టే ఈ కథ మొత్తం నడుస్తుంది. వారిద్దరి పాత్రల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. చిన్న బంగార్రాజును ఆత్మగా ఆవాహనం చేసుకొని హంగామా చేసే పెద్ద బంగార్రాజుగా నాగార్జున నటన హైలైట్‌గా నిలుస్తుంది. తొలిభాగం తరహాలోనే నాగార్జున పవర్‌ఫుల్‌గా కనిపించారు. నాగచైతన్య తనదైన శైలి వినోదంతో ఆకట్టుకుంటారు. ఇక నాగచైతన్య, కృతిశెట్టి జోడీ బాగా కుదిరింది. రమ్యకృష్ణ తొలిభాగంలో మాదిరిగానే ఇందులో కూడా చక్కటి అభినయాన్ని కనబరచింది. సర్పంచ్ నాగలక్ష్మిగా అల్లరి, అమాయకత్వం కలబోసిన పాత్రలో కృతిశెట్టి అందం, అభినయంతో మెప్పించింది. ఇక మిగతా పాత్రల్లో రావురమేష్, సంపత్‌రాజ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నాగబాబు తమ పరిధుల మేరకు నటించారు. సినిమాలోని గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. చక్కటి నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. అనూప్‌రూబెన్స్ సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్స్కోర్ బాగా కుదిరింది.
నాగార్జున ఆలపించిన ‘లడ్డుండా..’ పాట హుషారుని పంచుతుంది. యువరాజ్ కెమెరా గ్రామీణ అందాల్ని చక్కగా బంధించింది. సినిమా మొత్తాన్ని కలర్ఫుల్గా ప్రజెంట్ చేయడంతో యువరాజ్ పనితనం కనిపిస్తుంది. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తనదైన మాస్ అంశాలతో సినిమాను తీర్చిదిద్దాడు. కోనసీమ వెటకారం, హాస్యంతో ఆయన రాసిన సంభాషణలు బాగున్నాయి.
తీర్పు: నాగార్జున ప్రమోషన్స్‌లో చెప్పినట్టుగానే పండగసీజన్లో వినోదాన్ని పంచే చిత్రమిది. లాజిక్లను పక్కనబెట్టి చూస్తే బంగార్రాజు పర్వాలేదనిపిస్తాడు. సంక్రాంతి టైమ్‌లో ప్రేక్షకులు కోరుకునే అంశాలతో బంగార్రాజు అలరించే అవకాశముంది.
రేటింగ్: 2.75/5
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ప్రస్తుతానికి ప్రేమ, పెండ్లి ఆలోచనలు లేవు.. ట్రెండింగ్ సీరియల్ ఫేమ్