సినీరంగ సమస్యల్ని చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిపిన భేటీ సంతృప్తినిచ్చిందని చెప్పారు అగ్ర నటుడు చిరంజీవి. గురువారం ఆయన అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ ‘సమస్యను రెండు వైపుల నుంచి విని పరిష్కారం గురించి ఆలోచించాలని సీఎం నన్ను కోరారు. ఇండస్ట్రీలోని ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు, థియేటర్ ఓనర్స్ సమస్యల గురించి సీఎంకు వివరించాను. పరిశ్రమలోని అన్ని విభాగాల తాలూకు సమస్యల్ని ప్రస్తావించాను.వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
ఎవరో ఒకరి పక్షం వహించకుండా అందరిని సమానంగా చూస్తానన్నారు. ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని, కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సినీరంగం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా నిచ్చారు. ఆయన మాటలతో నాకు ధైర్యం వచ్చింది. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం కుదిరితే దానినే జీవోగా ఇస్తామని సీఎం తెలిపారు’ అని చిరంజీవి పేర్కొన్నారు. సీఎం ఆహ్వానిస్తేనే తాను ఈ భేటీకి వచ్చానని..ఈ చర్చల సారాంశాన్ని పరిశ్రమ పెద్దలందరికి వివరించి వారి సలహాల్ని తీసుకుంటానని చిరంజీవి చెప్పారు.