‘ఇది 1948లో జరిగే కథ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్‌కి మాత్రం స్వాతంత్య్రం రాని రోజులవి. ఓవైపు యాక్షన్ డ్రామా, మరోవైపు వార్.. ఈ నేపథ్యాలతో ఈ కథ నడుస్తుంది. చరిత్రలో బైరాన్‌పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో ‘మైఖేల్’ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ కథను అల్లారు. ఇందులో మైఖేల్‌గా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను.’ అని రోషన్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘చాంపియన్’. అనస్వర రాజన్ కథానాయిక. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మాతలు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా శనివారం రోషన్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఈ క్యారెక్టర్ కోసం చాలా హోమ్‌వర్క్ చేయాల్సొచ్చింది. ఇందులో మైఖేల్ ప్రాపర్ హైదరాబాదీ. అందుకే హైదరాబాద్ మాండలీకాన్ని స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది. నా తొలి సినిమా ‘పెళ్లిసందడి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ వచ్చింది. అది నాకు ఎంతో ఉపయోగపడింది. నటుడికి మానసిక పరిపక్వతతోపాటు మానవ సంబంధాలపై అవగాహన అవసరం. ఈ మూడేళ్లు వాటిపైఅధ్యయనం చేశాను. ఈ విరామం తర్వాత ఓ మంచి సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది.
ఇది 75ఏండ్ల నాటి కథ కావడంతో, దర్శకుడు ఎన్నో రిఫరెన్సులిచ్చారు. డైరెక్టర్‌తోపాటు స్వప్నగారు, తోట తరణిగారు ప్రతీది రీసెర్చ్ చేశారు. ఈ సినిమాకోసం చాలా వర్క్ షాపులు నిర్వహించాం. ఈ కథలో ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుంది. అనస్వర రాజన్‌తో పనిచేయడం గొప్ప అనుభవం. తను చాలా అనుభవం ఉన్న నటి. ఆమె పాత్రలో కూడా చాలా డెప్త్ ఉంటుంది. ఇక కల్యాణచక్రవర్తి, కోవై సరళ లాంటి సీనియర్లతో పనిచేసే అవకాశం ఈ సినిమాతో లభించింది. ఈ సినిమా కథే కాదు, నిర్మాణం కూడా ఓ ఎమోషనల్ జర్నీనే’ అని రోషన్ పేర్కొన్నారు.