తారాగణం: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్, వైవా హర్ష తదితరులు.
దర్శకత్వం: సందీప్ రాజ్.
సంగీతం: కాలభైరవ.
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ).
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా టాలీవుడ్లో రెండో ప్రయత్నం చేశారు. గతంలో ‘బబుల్ గమ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోషన్, ఈసారి ‘కలర్ ఫోటో’ లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమా దర్శకుడు సందీప్ రాజ్ కాంబినేషన్లో ‘మౌగ్లీ’ చిత్రంతో వచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా శనివారం విడుదలైంది. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? రోషన్ ఖాతాలో హిట్ పడిందా? రివ్యూ చూద్దాం.
కథ
పార్వతీపురం ఏజెన్సీలో స్థానిక సినిమా షూటింగ్‌లకు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్‌గా పనిచేస్తుంటాడు మురళీ కృష్ణ అలియాస్ మౌగ్లీ (రోషన్ కనకాల). ఎస్సై అవ్వాలనే లక్ష్యంతో ఉన్నా, స్నేహితుడు ప్రభాస్ బంటి (వైవా హర్ష) సాయంతో ఈ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక షూటింగ్లో సైడ్ డాన్సర్‌గా వచ్చిన జాస్మిన్ (సాక్షి మడోల్కర్)ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే, జాస్మిన్‌పై కన్నేసిన ఆ సినిమా నిర్మాత, ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆమెను ట్రాప్ చేసే క్రమంలో, మౌగ్లీకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి? ఈ కథలో క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) పాత్ర ఏమిటి? మౌగ్లీ, జాస్మిన్ల ప్రేమ చివరికి గెలిచిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సందీప్ రాజ్ నుంచి సినిమా వస్తుందంటే సహజంగానే కొత్తదనం ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ, ‘మౌగ్లీ’ కథ పాతదే. ఒక సామాన్యమైన హీరో, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోయిన్ను ప్రేమించడం, ఆ హీరోయిన్‌పై వ్యవస్థలో బలవంతుడైన మరో వ్యక్తి మోజు పడటం.. ఈ బలహీనుడు ఆ బలవంతుడిని ఎలా గెలిచాడు అనే మూలకథతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే పంథాలో నడుస్తుంది. అయితే, దర్శకుడు ఇక్కడ కర్మ సిద్ధాంతం అనే లైన్‌ను ప్రధానంగా తీసుకుని కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశారు.
ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా, సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కానీ, సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథ వేగం పుంజుకున్నా, కొన్ని సన్నివేశాలు పదే పదే అదే చోట తిరుగుతున్న ఫీలింగ్‌ను కలిగిస్తాయి. అయితే, క్లైమాక్స్‌ను మాత్రం దర్శకుడు కొత్తగా, కొంతమంది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నారు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ముగింపు ఇవ్వడం కొంతవరకు సినిమాకు కలిసొచ్చింది. ప్రేమ, యాక్షన్ అంశాల మేళవింపుతో వచ్చిన ఈ చిత్రం రొటీన్ కథనం కారణంగా నిరాశపరిచినా, కొన్ని సన్నివేశాల్లోని డైలాగ్స్, భావోద్వేగాలను పండించిన తీరు మెప్పిస్తుంది.
నటీనటులు
రోషన్ కనకాల: యంగ్ హీరో రోషన్ కనకాల ఈ సినిమాలో తనదైన మార్కు చూపించాడు. చేసింది రెండో సినిమా అయినప్పటికీ, తన తొలి చిత్రం ‘బబుల్ గమ్’తో పోలిస్తే, నటనలో స్పష్టమైన మెరుగుదల కనబడింది. ముఖ్యంగా, మౌగ్లీ అలియాస్ మురళీ కృష్ణ అనే సామాన్య యువకుడి పాత్రలో రోషన్ ఒదిగిపోయాడు. అమాయకత్వం, ప్రేమ, కోపం, ఆవేదన వంటి భిన్నమైన భావోద్వేగాలను పండించడంలో చక్కటి పరిణతిని ప్రదర్శించాడు. క్లైమాక్స్ ముందు వచ్చే కీలకమైన భావోద్వేగ సన్నివేశాలలో అతని నటన ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది. అయితే, లుక్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ, ఒక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్, ఎస్సై అవ్వాలని కలలు కనే పల్లెటూరి యువకుడి పాత్రకు మాత్రం రోషన్ పర్ఫెక్ట్గా సరిపోయాడు. తన పాత్రలోని స్వభావం, నడవడికను బాగా అర్థం చేసుకుని నటించగలిగాడు. భవిష్యత్తులో సరైన కథ, పాత్రలు ఎంచుకుంటే, హీరోగా రోషన్ నిలదొక్కుకునే అవకాశం పుష్కలంగా ఉంది.
బండి సరోజ్: విలన్‌గా తనదైన లౌడ్ పర్ఫార్మెన్స్తో మెప్పించాడు.
సాక్షి మడోల్కర్: డైలాగ్స్ చెప్పే స్కోప్ తక్కువగా ఉన్నా, తన ఎక్స్‌ప్రెసివ్ పర్ఫార్మెన్స్తో, కళ్ళతోనే నటిస్తూ ఆకట్టుకుంది.
వైవా హర్ష: హీరో స్నేహితుడిగా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు.
సాంకేతిక అంశాలు
కాలభైరవ అందించిన కొన్ని పాటలు వినడానికి, పిక్చరైజేషన్ పరంగా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మంచి లొకేషన్స్‌ను ఎంచుకుని తెరపై అందంగా చూపించారు. సినిమా కోసం నిర్మాతలు బాగానే ఖర్చుపెట్టారు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.
దర్శకత్వం, ఎడిటింగ్: దర్శకుడు సందీప్ రాజ్ తన మార్కును మరోసారి ఈ సినిమాలో చూపించాడు. అయితే కథనం విషయంలో మరింత కొత్తగా ప్రయత్నించి ఉండాల్సింది. నిడివి (రన్ టైమ్) విషయంలో ఎడిటర్ ఇంకా వర్కౌట్ చేసి ఉండొచ్చు. ఫైట్స్ డిజైన్ బాగుంది.
చివరిగా
‘మౌగ్లీ’ చిత్రం లవ్-యాక్షన్ డ్రామాను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథాంశం పాతదే అయినప్పటికీ, దర్శకుడు దానిని కర్మ సిద్ధాంతం అనే కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల కథనం నెమ్మదించినా, సినిమాకు క్లైమాక్స్ హైలైట్‌గా నిలుస్తుంది. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మొత్తం మీద, రోషన్ కనకాలకి ‘మౌగ్లీ’తో మంచి విజయం రాబోతుందని చెప్పవచ్చు.