జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: దిలీష్ పోతన్, రోషన్ మాథ్యూ, అరుణ్ చెరుకవిల్, లక్ష్మీ మేనన్, సజయ్ సెబాస్టియన్ తదితరులు, దర్శకత్వం: షాహీ కబీర్
‘ఖాకీ’ కథలను కొత్తగా చూపించడంలో మలయాళీ డైరెక్టర్లు ఆరితేరారు. సగటు ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచేలా.. ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దుతున్నారు. అందుకే, ‘పోలీస్ జానర్’లో లెక్కకు మిక్కిలి సినిమాలు, వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. రుతుపవనాల కన్నా వేగంగా ఓటీటీల్లోకి వదులుతున్నారు. ఆసక్తికరంగా సాగే ‘పోలీస్ స్టోరీ’లకు ఇక్కడి ప్రేక్షకులూ బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, సాధారణంగా పోలీసులను హీరోలుగా చూపించడమో.. వాళ్ల దాష్టీకాలను బయటపెట్టడమో చేస్తుంటారు. అందుకు భిన్నంగా.. పోలీసుల జీవితాల్లోని చీకటి కోణాలను తెరపై చూపించే చిత్రం.. రోంత్! గత నెలలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. తాజాగా, ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్కు వచ్చింది. హిట్‌టాక్ తెచ్చుకొని.. రికార్డ్ స్ట్రీమింగ్‌తో దూసుకెళ్తున్నది.
ఈ కథ కేరళలోని ‘ధర్మశాల’లో సాగుతుంది. ధర్మశాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ యోహన్నా (దిలీష్ పోతన్), కానిస్టేబుల్ దిన్నాథ్ (రోషన్ మాథ్యూ) పనిచేస్తుంటారు. పోలీసుగా.. యోహన్నాకు పాతికేళ్ల అనుభవం ఉంటుంది. ఎప్పుడూ భార్య మానసిక స్థితి గురించే ఆందోళన చెందుతుంటాడు. ఇక దిన్నాథ్.. అప్పుడప్పుడే ఉద్యోగంలో చేరుతాడు. తల్లి, భార్యతోపాటు ఏడాది వయసున్న బిడ్డతో కలిసి ధర్మశాలకు వస్తాడు. అయితే.. దిన్నాథ్ సున్నితమైన వ్యక్తి అనీ, తనకు పోలీస్ ఉద్యోగం కరెక్ట్ కాదని యోహన్నా భావిస్తుంటాడు.
ఇలా ఉండగా, ఒకరోజు బిడ్డకు జ్వరంగా ఉన్నప్పటికీ.. తప్పనిసరి పరిస్థితిల్లో డ్యూటీకి వస్తాడు దిన్నాథ్. అదేరోజు యోహన్నా-దిన్నాథ్ కలిసి గస్తీకి వెళ్తారు. ఈ క్రమంలో వారిద్దరికీ అనేక సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. డ్యూటీని సవ్యంగానే పూర్తిచేశామని భావించి ఇంటికి వెళ్లిపోతారు. అప్పుడే వాళ్లకు ఓ అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. అదేంటి? ఆ సంఘటన వాళ్ల జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది? అనేది మిగతా కథ.