తెలుగు తెరపై అరుదుగా కనిపించే రియలిస్టిక్ గ్రామీణ కథాంశంతో, బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రం ‘రోలుగుంట సూరి’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం, తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మాణంలో రూపొందింది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందని చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ
రోలుగుంట అనే గ్రామంలో కథ మొదలవుతుంది. జైలు నుంచి విడుదలైన సూరి (నాగార్జున పల్లా) అనే తక్కువ కులానికి చెందిన యువకుడు తన నిజాయితీ, కష్టంతో గ్రామంలో గౌరవం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే కమల (ఆధ్యారెడ్డి)తో ప్రేమలో పడతాడు. అయితే, ఒక కబడ్డీ మ్యాచ్‌తో మొదలైన చిన్న గొడవలు గ్రామంలో పెద్ద చర్చకు దారితీస్తాయి. గ్రామంలోని పైవర్గానికి చెందిన ప్రెసిడెంట్, కాషి అతడి గ్యాంగ్‌కు సూరి ఎదుగుదల నచ్చదు. కులం, క్లాస్, గ్రామ ప్రతిష్ఠ వంటి అంశాలు కలగలసి చిన్న గొడవలు పెద్దవిగా మారుతాయి. సూరిపై అవమానాలు, దాడులు పెరుగుతాయి. గ్రామ ప్రెసిడెంట్ అతడిని అంటరానివాడిగా చిత్రీకరించి కుటుంబాన్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి, ప్రెసిడెంట్ మనుషులు సూరి తల్లిదండ్రులను ఇంటితో సహా అగ్గిపెట్టి కాల్చేయడం హృదయాన్ని ద్రవించే అంశం. ఈ దారుణ సంఘటన వెనుక ఉన్న నిజం ఏమిటి? సూరి తన తల్లిదండ్రుల పగను ఎలా తీర్చుకున్నాడు? అనే ట్విస్టులతో కథనం ముందుకు సాగుతుంది.
విశ్లేషణ:
దర్శకుడు అనిల్ కుమార్ పల్లా గ్రామీణ వాస్తవాలను, కుల వ్యవస్థను, మనుషులలోని పగను ఎంతో నిజాయితీగా తెరపై ఆవిష్కరించారు. సూరి తల్లిదండ్రులపై దాడి చేసే సన్నివేశాలు హృదయాన్ని కదిలించేలా ఉంటాయి. రియలిస్టిక్ టచ్‌తో చేసిన ఫైట్ సీక్వెన్స్‌లు గూస్బంప్స్ తెప్పిస్తాయి. యూత్‌ను ఆకట్టుకునే రొమాన్స్ భాగం తెలుగు సినిమాలకు భిన్నంగా, బోల్డ్‌గా, నేచురల్‌గా చిత్రీకరించబడింది. సినిమాలోని కలర్ టోన్, లొకేషన్స్ మరియు గ్రామీణ వాతావరణం ప్రేక్షకులకు నిజమైన పల్లెటూరి అనుభూతిని ఇస్తాయి.
నటీనటులు
నాగార్జున పల్లా సూరి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. గ్రామీణ యువకుడి బాడీ లాంగ్వేజ్, భాష, నటన ఎక్కడా అతి లేకుండా చాలా నేచురల్‌గా చేశారు. ఆధ్యారెడ్డి (కమల) మర్యాదగా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్రకు ఆమె న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలలో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. భావన నీలప్ తెరపై కనిపించిన ప్రతిసారీ మంచి ప్రెజెన్స్ చూపించింది. బ్రహ్మనందరెడ్డి పవర్ఫుల్ విలన్ షేడ్‌లో కనిపించిన ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సన్నివేశాలకు బలాన్నిచ్చాయి. సత్యనారాయణ, అయూషా, జ్యోతి, మహర్షి రమణ వంటి ఇతర నటులు తమ పాత్రలకు డెప్త్ ఇచ్చి కథను బలపరిచారు.
సాంకేతిక విభాగం:
దర్శకత్వం & సినిమాటోగ్రఫీ (అనిల్ కుమార్ పల్లా): దర్శకుడిగా ఆయన చాలా నమ్మకంగా, రియలిస్టిక్ కథనాన్ని తెరకెక్కించారు. ఆయనే స్వయంగా డీఓపీగా వ్యవహరించడం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్రతి ఫ్రేమ్‌లో గ్రామీణ సోల్‌ను పట్టుకున్నారు. సుభాష్ ఆనంద్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ రస్టిక్ ఫ్లేవర్‌ను ఇచ్చి సినిమాను నిలబెట్టాయి. ‘నిన్న.. మొన్న..’ అనే ప్రణయ విరహ గీతం (రచన: రామారావు మాతుమూరు) సినిమాకు ఆత్మగా నిలిచింది. సందీప్ చక్రవర్తి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్సిటీని అద్భుతంగా పెంచింది. ఆవుల వెంకటేష్ పేసింగ్ బాగుంది. ఫ్లాష్‌బ్యాక్‌లను బాగా సెట్ చేశారు. అయితే, కొన్ని చోట్ల కొంచెం ట్రిమ్ చేసే అవకాశం ఉంది. కథ, డైలాగ్స్ (మహ్మద్ సాయి): పక్కా గ్రామీణ యాసను, మాటల బలాన్ని డైలాగ్స్‌లో చూపించారు. ఫైట్స్ (వాసు) & ఆర్ట్ డైరెక్షన్ (ఎస్. రమేష్): వాస్తవ గ్రామీణ కొట్లాటలను చూపించిన వాసు ఫైట్స్, పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టిన ఆర్ట్ వర్క్ సినిమాకు సోల్నిచ్చాయి.
ప్లస్ పాయింట్స్:
రియలిస్టిక్ విలేజ్ డ్రామా & కథాంశం.
నాగార్జున పల్లా నటన.
సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్.
బలమైన ఎమోషనల్ సీన్లు.
మైనస్ పాయింట్స్:
కొన్ని చోట్ల నిడివి ఎక్కువగా అనిపించడం.
చివరిగా
‘రోలుగుంట సూరి’ అనేది రియలిజం, ఎమోషన్, ఇంటెన్సిటీతో నిండిన విలేజ్ డ్రామా. కులం, ప్రేమ, పగ, గ్రామీణ రాజకీయాలు మిళితమైన ఈ సినిమా తెలుగులో అరుదైన మంచి ప్రయత్నం. బలమైన భావోద్వేగాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.
రేటింగ్: 3/5