బాలీవుడ్లో పోలీస్ కథలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు రోహిత్‌శెట్టి. ‘కాప్ యూనివర్స్’లో భాగంగా ఆయన తీసిన ‘సింగం’ సిరీస్ చిత్రాలు పాపులర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మరో సూపర్‌కాప్ చిత్రానికి సిద్ధమవుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడు అయిన ముంబయి మాజీ జాయింట్ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. రోహిత్‌శెట్టి రూపొందించిన కాప్ యూనివర్స్ చిత్రాల పరిశోధన, సమాచార సేకరణ విషయంలో రాకేష్ మారియా ఎంతో సహాయాన్ని అందించారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్తోనే తాను పోలీస్ కథలను అద్భుతంగా తీయగలిగానని రోహిత్‌శెట్టి అనేక సందర్భాల్లో తెలిపారు. ఈ నేపథ్యంలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా పేరున్న రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో జాన్అబ్రహమ్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం వేసవిలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.