‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది రితికా నాయక్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం రితికా నాయక్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఈ సినిమాలో తాను హిమాలయాల్లో ఉండే సన్యాసిని పాత్రలో కనిపిస్తానని, భిన్న పార్శాల్లో తన క్యారెక్టర్ సాగుతుందని చెప్పింది. హీరో తేజ సజ్జా అంకితభావం కలిగిన నటుడని, జగపతిబాబు, శ్రియ వంటి సీనియర్స్ కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని తెలిపింది.
‘ఈ సినిమా 80శాతం లైవ్ లోకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్లడం ఛాలెంజింగ్‌గా అనిపించేది. కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలన్నది నా అభిమతం. అలాగే నాకు సూపర్‌హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. యాక్షన్, రొమాన్స్ నా ఫేవరేట్ జోనర్స్. కథానాయికల్లో నేను సాయిపల్లవి అభిమానిని. నటనలో తనే నాకు స్ఫూర్తి. ‘ఫిదా’ సినిమా చూసి నిజంగా ఫిదా అయిపోయా. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నా. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి’ అని రితికా నాయక్ చెప్పింది.