‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కన్నడ నటుడు రిషబ్‌శెట్టి. స్వీయ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన ఈ డివోషనల్ థ్రిల్లర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం రిషబ్‌శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ ‘కాంతార చాప్టర్-1’ నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన భారీ ఫిక్షనల్ హిస్టారికల్ చిత్రంలో నటించబోతున్నారు. 18వ శతాబ్దంలో భారత్‌లోని సంక్షుభిత బెంగాల్ ప్రావిన్స్‌లోని ఓ తిరుగుబాటుదారుడి కథ ఇది.
ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించబోతున్నది. బుధవారం మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించనున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.