రెండేళ్ల క్రితం కన్నడలో రూపొంది, తెలుగులో అనువాదమైన ‘కాంతార’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో కేవలం 16కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా 450కోట్ల వసూళ్లు రాబట్టి, కన్నడ సినిమా ఖ్యాతిని పెంచింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ రూపొందుతున్న విషయం తెలిసిందే. కదంబుల కాలంలో సాగే కథాంశంతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తున్నది.
రిషబ్‌శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కింగరదూర్ నిర్మిస్తున్న ఈ భారీ పీరియాడిక్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. దేశవాప్తంగా భారీ అంచనాలున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది.
వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ని విడుదల చేయనున్నట్టు ఆదివారం మేకర్స్ ప్రకటించారు. జయరామ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కూడా నటిస్తారని గతంలో వార్తలొచ్చాయి. రిషబ్ ప్లాన్ చేస్తే ‘కాంతార’లో భాగం అవ్వడానికి తనకేం అభ్యంతరం లేదని తారక్ కూడా అన్నారు. మరేమవుతుందో చూడాలి.