Rishab Shetty | కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే, ఈ కార్యక్రమంలో రిషబ్ శెట్టి తన స్పీచ్ మొత్తాన్ని కన్నడలోనే ఇచ్చారు. ఈ సందర్భంలో తెలుగు ఆడియన్స్‌కు ఆయన మాటలు అర్థం కాలేదు. కొందరు తెలుగు అభిమానులు ఈ విషయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “స్పీచ్ మొదట తెలుగులో ప్రారంభించి, తరువాత కన్నడ, ఇంగ్లీష్ మిక్స్ చేసి ఉంటే బాగుండేది” అని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం స్పీచ్ కన్నడలోనే ఉండడం వల్ల తెలుగు ఆడియన్స్ హర్ట్ అయ్యారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడిచింది.
మరోవైపు తమిళ్ ఇండస్ట్రీలో తమిళ భాషలో ఇంటర్వ్యూలు ఇస్తూ.. తెలుగులో మాత్రం ఇలా చేయడం కరక్ట్ కాదు అని వాదిస్తున్నారు . తెలుగు భాషకి ప్రాధాన్యం ఇవ్వకుండా కన్నడలో మాట్లాడటం సరియనది కాదని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా కన్నడ సినిమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్స్ పెంచడం కూడా ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. “డబ్బింగ్ సినిమాకు ఇక్కడ రేట్స్ ఎందుకు పెంచుతున్నారు?” అని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విషయంలో భాషా వివాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీల్లో తెలుగు టైటిల్ ఉందనే విషయంపై స్థానిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి వాటిని తీసివేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, ‘కాంతార’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివాదం హాట్ టాపిక్ అయింది.
అయితే ఈ వివాదంపై రిషబ్ శెట్టి తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో స్పందించారు. “నేను ఎక్కువగా కన్నడలో ఆలోచిస్తాను కాబట్టి సహజంగానే ఆ భాషలో మాట్లాడటం జరిగింది. కానీ ప్రతి భాషను గౌరవిస్తాను. ఎక్కడికైనా వెళితే, ఆ ప్రాంత భాషకు గౌరవం ఇవ్వడం అవసరం. కొన్నిసార్లు నా ఉద్దేశం తప్పుగా ప్రెజెంట్ అవుతుంది. నేను కన్నడిగుడిని అని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంది. కానీ అన్ని భాషల పట్ల సమాన గౌరవం చూపిస్తాను. ఇకపై ఇతర భాషల్లో కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను” అని ఆయన తెలిపారు. రిషబ్ ఇచ్చిన ఈ వివరణ తెలుగు అభిమానులని శాంతింపజేసే అవకాశముంది. ఇక ‘కాంతార : చాప్టర్ 1’ చిత్రాన్ని అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేశారు. సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.