‘కాంతార’ చిత్రానికి దేశవ్యాప్తంగా ఆదరణ దక్కింది. దక్షిణ కన్నడ సంస్కృతి, ఆచార వ్యవహారాలను ఆవిష్కరిస్తూ డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ‘కాంతార చాప్టర్ 1’పేరుతో ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘కాంతార’ ముందు జరిగే కథ ఇది. సోమవారం చిత్ర కథానాయకుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి పుట్టిన రోజు సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, డివైన్ సినిమాటిక్ విజువల్ వండర్‌గా ఆకట్టుకుంటుందని, అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. ‘కాంతారా ఛాప్టర్-1’ చిత్రం కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేశారని, 500 మంది ఫైటర్లు, 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో తీసిన యుద్ధ ఘట్టం భారతీయ సినిమా చరిత్రలోనే ఓ రికార్డని మేకర్స్ పేర్కొన్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.