‘నా మూడేళ్ల వయసులో మా అమ్మమ్మ నన్ను కూర్చోబెట్టి తన ఊరు కుందాపురాకు చెందిన కథలు చెప్పేది. ఆ కథలు వింటూ ఇవి నిజంగా జరిగిన కథలేనా అనిపించేది. చాలా నచ్చేవి కూడా. ఈ గుళిగా అంటే ఏంటి? ఈ పింజర్లేంటి? ఒక్కసారి వెళ్లి చూడాలి అనుకునేవాడ్ని. నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు సినిమా తీస్తాడని అనుకోలేదు. ఆ వ్యక్తే నా సోదరుడు రిషబ్ శెట్టి. తెరపై ఆ కథను తొలిసారి చూసినప్పుడు మాట్లాడలేకపోయా.
ఈ కథ తెలిసిన నేనే అలా అయిపోతే.. తెలియని జనం ఎంత సంభ్రమకు లోనై ఉంటారు! అదే ‘కాంతార’. సినిమాకు చెందిన 24శాఖలపై పట్టున్న అద్భుత కళాకారుడు రిషబ్‌శెట్టి. ‘కాంతార చాప్టర్ 1’ సామాన్యమైన సినిమా కాదు. దీనికోసం ఆయన ఓ యజ్ఞమే చేశారు. ఇదొక అద్భుతమైన కల. తన భార్య ప్రగతిగారి సహకారం వల్లే ఆయనకు ఇది సాకారమైంది. ఈ సినిమా మనందర్నీ రంజింపజేస్తుందని, బ్లాక్‌బస్టర్‌గా చరిత్ర సృష్టిస్తుందని దేవుడ్ని కోరుకుంటున్నా.’అని ఎన్టీఆర్ అన్నారు.
రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాంతార చాప్టర్ 1’. బ్లాక్‌బస్టర్ ‘కాంతార’కు ఈ సినిమా ప్రీక్వెల్. హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ పై విధంగా స్పందించారు. రిషబ్‌శెట్టి మాట్లాడుతూ ‘మీ ప్రేమకీ, మీ సహకారానికీ థ్యాంక్స్. పక్క రాష్ట్రం వాడినైనా సొంత మనిషిగా ప్రేమను పంచుతున్న మీ రుణం తీర్చుకోలేను.’ అన్నారు. ఇంకా ప్రగతి శెట్టి, కథానాయిక రుక్మిణి వసంత్, నిర్మాత రవిశంకర్, రాంబాబు గోసాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.