Shetty Gang | కన్నడ చిత్ర పరిశ్రమలో ‘శెట్టి గ్యాంగ్’ గా గుర్తింపు తెచ్చుకున్న నటులు రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బి. శెట్టి మరియు నటుడు ప్రమోద్ శెట్టిల మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హీరో రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తన ప్రాణ స్నేహితులైన రక్షిత్, రాజ్, ప్రమోద్‌లతో పాటు తమకు ఎంతో గుర్తింపు తెచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ అకౌంట్‌ను కూడా అన్‌ఫాలో చేయడమే ఈ రూమర్లకు ఆజ్యం పోసింది. దీంతో వీరి కాంబినేషన్‌కు బ్రేక్ పడిందని, వీరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయని నెట్టింట చర్చలు మొదలయ్యాయి.
అయితే తాజాగా ఈ వైరల్ వార్తలపై నటుడు ప్రమోద్ శెట్టి స్పందిస్తూ.. అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాడు. అతడు నటిస్తున్న తాజా చిత్రం ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన.. రిషబ్ శెట్టి తమ అకౌంట్లను అన్‌ఫాలో చేశాడనే విషయం తనకు ఇతరులు చెబితేనే తెలిసిందని అన్నారు. సాధారణంగా సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను వారి పీఆర్ టీమ్స్ లేదా ప్రత్యేక ఏజెన్సీలు హ్యాండిల్ చేస్తుంటాయని, ఆ క్రమంలోనే ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బి. శెట్టి మరియు తాను ఎప్పటికీ మంచి స్నేహితులమేనని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ప్రమోద్ శెట్టి స్పష్టం చేశారు. కేవలం సినిమాల అప్డేట్స్ ఉన్నప్పుడే తాము ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతుంటామని, ప్రస్తుతం అందరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే కలిసి కనిపించడం లేదని వివరించారు. రక్షిత్ శెట్టి తన తదుపరి స్క్రిప్ట్ పనుల్లో ఉండగా, రాజ్ బి. శెట్టి చెన్నైలో ఓ సినిమా షూటింగ్లో ఉన్నారని చెబుతూ తమ మధ్య బంధం ఎప్పటిలాగే బలంగా ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు.