RGV | బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ సినిమా ‘వార్ 2’. ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, అనూహ్యంగా మిక్స్డ్ టాక్ ఎదుర్కొంటూ తీవ్ర విమర్శల పాలైంది. స్పై యాక్షన్ జానర్లో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను చాలా తక్కువగా చూపించారని, ఆయన క్యారెక్టర్ అంత స్ట్రాంగ్‌గా లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. “ఇలాంటి కథకు ఎన్టీఆర్ తన టైమ్ వేస్ట్ చేసుకున్నాడు” అంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో రూ. 40 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులోనే కాదు, హిందీలో కూడా సినిమాకి ఆశించిన స్థాయి ఆదరణ రాకపోవడంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సినిమాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ, చప్పగా సాగే స్క్రీన్‌ప్లే, అసంబద్ధమైన సన్నివేశాలు ప్రేక్షకులను విసిగించాయన్నది వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ జపాన్ వాళ్లతో ఫైట్ ఉంటుంది. అసలు జపాన్ మన మిత్ర దేశం. అలాంటి వారితో ఫైట్ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. స్పై యూనివర్స్ అంటే శత్రుదేశాలతో పోరాటాలు ఉండాలి. కానీ ఇక్కడ లాజిక్ మిస్ అయింది. సంబంధం లేని విధంగా సన్నివేశాలు రూపొందించారు.ఈ క్రమంలోనే సినిమా కథే చచ్చిపోయింది.అలాగే, హీరోల ఎలివేషన్ కోసం సీన్స్ క్రియేట్ చేయడం వల్లనే సినిమాలు ఫెయిలవుతున్నాయి. దర్శకులు కథ విషయంలో శ్రద్ధ చూపించాలి. హీరోని గొప్పగా చూపించాలనే ప్రయత్నంలో కథని మరుస్తున్నారనే నిజాన్ని గ్రహించాలి” అని విమర్శించారు. ఆర్జీవీ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం స్పందిస్తూ, “ఇది నిజం. మాస్ ఎలివేషన్ కంటే కథ, పాత్ర బలమే ముఖ్యమని చెబుతున్న మాటల్లో నిజం ఉంది” అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ‘వార్ 2’ ఫలితం.. మూవీ లవర్స్‌ను నిరాశపరచడమే కాకుండా, ఎన్టీఆర్ తదుపరి బాలీవుడ్ ప్రయాణంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి