‘రక్త చరిత్ర’ తన కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రమని చెప్పారు అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. శాంతికి, యుద్ధానికి ఉన్న అంతరాన్ని చర్చిస్తూ, యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ఈ సినిమాలో చూపించామన్నారు. అయితే దీనికి మూడో భాగాన్ని తీసే అవకాశమే లేదని ఆయన తేల్చిచెప్పారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో యథార్థ సంఘటనల నేపథ్యంలో ఆయన రూపొందించిన ‘రక్త చరిత్ర’ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో దర్శకులకు పెద్దపీట వేసేవారని, ఇప్పుడు స్టార్ డామినేషన్ ఎక్కువైందనే ప్రశ్నకు బదులిస్తూ..కోట్లాది రూపాయల సినిమా బిజినెస్ స్టార్స్ మూలంగా జరుగుతున్నప్పుడు సహజంగా వారి డామినేషన్ ఉండటంలో తప్పులేదన్నారు. ప్రస్తుతం తాను పోలీస్ నేపథ్యంలో ఓ హిందీ చిత్రాన్ని చేస్తున్నానని, అందుకే ముంబయిలో ఉంటున్నానని వర్మ తెలిపారు. నిర్మాతలు నట్టి కుమార్, మురళీకృష్ణ వంకాయలపాటి ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.