నటనతో ఇంప్రెస్ చేస్తూనే అందంతో ఆకట్టుకునే పాత్రలు కథానాయికలకు అరుదుగా దొరుకుతాయి. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలో కాయాదు లోహర్ పోషించింది ఆ తరహా పాత్రే. త్వరలో విశ్వక్సేన్ ‘ఫంకీ’ సినిమాతో ఈ అస్సాం చిన్నది తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నది. ఇందులో పాత్ర కూడా అటు అందం, ఇటు అభినయం మేళవింపుగా ఉంటుందని చెబుతున్నది కాయాదు లోహర్. ఇటీవల ఈ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ ‘ఇది సినిమా నేపథ్యంతో కూడిన కథ. ఇందులో నేను నిర్మాత కూతురుగా కనిపిస్తా. నా క్యారెక్టర్ పేరు చిత్ర.
తండ్రి డబ్బుని ఆదా చేయాలని ఆశించే కూతురు పాత్ర. అంతేకాదు, మనీ మేనేజ్మెంట్ గురించి తను ఎక్కువగా మాట్లాడుతుంటుంది. డబ్బుని అమితంగా ప్రేమిస్తుంది. నిజంగా విభిన్నమైన పాత్రని చెప్పొచ్చు. విశ్వక్ ఇందులో డైరెక్టర్గా కనిపిస్తారు. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ వినోదాత్మకంగా ఉంటాయి. దర్శకుడు అనుదీప్ రాసుకున్న కథలోనే తెలియని ఫన్ ఉంది. అదేంటో రేపు మీరు థియేటర్లలో చూస్తారు’ అని తెలిపింది కాయాదు లోహర్. ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.