సీనియర్ తమిళ నటుడు శివకుమార్‌లో పుత్రోత్సాహం పెల్లుబికింది. ఇటీవల చెన్నైలో జరిగిన ‘రెట్రో’ సినిమా ఆడియో వేడుకలో తన తనయుడు, తమిళ అగ్ర హీరో సూర్య గురించి శివకుమార్ ఉద్వేగంగా మాట్లాడారు. ‘నా కొడుకు అనే ముద్ర సూర్యపై ఎప్పుడూ లేదు. కెరీర్ ప్రారంభం నుంచి కష్టపడటం తప్ప తనకు మరొకటి తెలీదు. కోట్లాదిమందికి తను ఇష్టమైన నటుడు అయ్యాడంటే కారణం ఆ కష్టమే. కెరీర్ తొలినాళ్లలో నాన్‌స్టాప్‌గా నాలుగ్గంటలు డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. తెల్లవారుజామున నాలుగంటలకే నిద్ర లేచి, బీచ్‌కి వెళ్లి స్టంట్స్ నేర్చుకునేవాడు. నిజాయితీగా ఓ విషయం చెబుతున్నా. కోలీవుడ్‌లో సిక్స్‌ప్యాక్ చేసిన తొలి హీరో నా కుమారుడు సూర్య. అప్పటివరకూ సిక్స్‌ప్యాక్ అంటే కూడా ఎవరికీ తెలీదు. నటుడిగా ఎన్నో గొప్ప పాత్రలు చేశాడు. ఒక తండ్రిగా సూర్య విషయంలో ప్రతిక్షణం గర్విస్తూనే ఉన్నా.’ అన్నారు శివకుమార్. తండ్రి మాటలకు అక్కడే ఉన్న సూర్య భావోద్వేగానికి లోనయ్యారు.