హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రాంగోపాల్‌పై (Ram Gopal Varma) మరో కేసు నమోదయింది. రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా (Anjana Sinha) ఫిర్యాదుతో ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు ఫైల్‌చేశారు. 2022లో ‘దహనం’ అనే వెబ్‌సిరీస్‌ను ఆర్జీవీ (RGV) నిర్మాతగా తెరకెక్కించారు. అదేఏడాది ఏప్రిల్ 14న ఆ సినిమా విడుదలైంది. ఫ్యూడలిస్టులు, మావోయిస్టుల మధ్య జరిగే పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఆర్జీవీ నిర్మాణ సారధ్యంలో డైరెక్టర్ అగస్త్య మంజు దీనిని రూపొందించారు. ఓ కమ్యూనిస్టు నేతను ఏ విధంగా హత్య చేశారు, తన తండ్రి మరణానికి ఆయన కొడుకు ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడని ఇందులో చూపించారు. ఈ సినిమాను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించినట్లు ఆర్జీవీ వెల్లడించారు.
అయితే అదంతా నిజం కాదని, తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని పేర్కొంటూ అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని అందులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.