Kamal Haasan | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ స్పందిస్తూ గవర్నర్ తీరును తప్పుబట్టాడు. తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కమల్ పేర్కొన్నారు. తమిళనాడు చరిత్రలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని, ఈ క్రమంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై ఉందని గవర్నర్‌కి ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతను ప్రస్తావిస్తూ ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కమల్ హాసన్ గుర్తుచేశాడు. ‘మెజారిటీ అనేది రాజ్‌భవన్‌లో కాదు, అసెంబ్లీ వేదికగానే నిరూపితం కావాలి’ అని తెలిపారు. ఇక 108 స్థానాలు గెలుచుకున్న విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరకపోవడం ఓటర్ల తీర్పును ధిక్కరించడమేనని, ఇప్పటికీ 233 మంది ఎన్నికైన ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో తమకు మెజారిటీ రానందున బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని ప్రకటించిన తన సోదరుడు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాజకీయ పరిణతిని కమల్ హాసన్ అభినందించారు. ఇది పార్టీ పరంగా చేస్తున్న విమర్శ కాదు, ఒక భారతీయ పౌరుడిగా తన రాజ్యాంగ హక్కుల కోసం వినిపిస్తున్న గొంతుక అని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే ప్రజా తీర్పును గౌరవించి, రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తించాలని ఆయన సంబంధిత వర్గాలను కోరారు.