2004లో వచ్చిన ‘7/జీ బృందావన్ కాలనీ’ కల్ట్ మూవీగా ఆనాటి యువతరాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఏ.యం.రత్నం నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 22న రీరిలీజ్ చేయబోతున్నారు. శనివారం రీరిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘ఇదొక పొయొటిక్ లవ్‌స్టోరీ. తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది. రిరిలీజ్లో కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందనుకుంటున్నా. రవికృష్ణతో ‘7/జీ బృందాన్ కాలనీ పార్ట్-2’ని వచ్చే నెల నుంచి మొదలుపెడుతున్నాం. స్క్రిప్ట్ సిద్ధమైంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తారు’ అన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత రవి పాత్రలోకి వెళ్లిపోయానని హీరో రవికృష్ణ తెలిపారు.